శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: బుధవారం, 4 మే 2016 (19:45 IST)

ఏపీని నిట్టనిలువునా ముంచిన భాజపా... తొక్కేసిన కాంగ్రెస్... ఇపుడేం చేయాలి...?

అవి రెండూ జాతీయ పార్టీలు. ఆనాడు ఏపీ విభజనలో కాంగ్రెస్ పార్టీ ఏపీని తొక్కేస్తూ చీల్చేసి రాజధాని లేకుండా అవతల విసిరిపారేసింది. చట్టంలో ప్రత్యేక హోదా అనే మాటను చేర్చకుండా సభలో మాత్రం ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా అంటూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్ప

అవి రెండూ జాతీయ పార్టీలు. ఆనాడు ఏపీ విభజనలో కాంగ్రెస్ పార్టీ ఏపీని తొక్కేస్తూ చీల్చేసి రాజధాని లేకుండా అవతల విసిరిపారేసింది. చట్టంలో ప్రత్యేక హోదా అనే మాటను చేర్చకుండా సభలో మాత్రం ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా అంటూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఇప్పుడా మాటకు విలువ లేదనీ, చట్టంలో పెట్టలేదు కనుక ప్రత్యేక హోదా ఏపీకి దుర్లభమని తేల్చేశారు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన లేదని కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైన మేరకు ప్రత్యేక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 
 
నీతి ఆయోగ్‌ సిఫార్సులకు అనుగుణంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తామన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2014-15లో 4,403 కోట్లు, 2015-16లో రూ.2వేల కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ద్రవ్యలోటు భర్తీ కింద రూ.2,803 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.700 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.850 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. అంతేకానీ ఏపీ విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా అమలు సాధ్యం కాదని స్పష్టం చేశారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి జయంత్ సిన్హా తేల్చేసిన నేపథ్యంలో.. ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో ఆవేదన వ్యక్తం చేశారు. సిన్హా చేసిన ప్రకటన తమకు బాధ కలిగించిందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్రకటన చేసిన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఎవరి సిఫార్సుతో ప్రత్యేక హోదా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. 
 
మునుపటి యూపీఏ, ప్రస్తుత ఎన్డీయే మాటలతో మోసపోయామనే భావన ఏపీ ప్రజల్లో కలుగుతోందని గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయాన్ని గల్లా జయదేవ్ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ.. సిన్హా చేసిన ప్రకటన.. ఆనాడు సభలో ప్రధాని ఇచ్చిన హామీకి విలువ లేకుండా చేసేసిందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేతులు జోడించి అడుగుతున్నా అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
 
కేంద్రమంత్రి సిన్హా ప్రకటన నేపధ్యంలో ఏపీలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కేంద్రమంత్రివర్గం నుంచి తెదేపా మంత్రులు తక్షణమే వైదొలగాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఏపీ నాయకులంతా కలిసి ప్రధాని మోదీ ఇంటి ముందు బైఠాయించాలని చలసాని శ్రీనివాస్ పిలుపునిస్తున్నారు. పార్లమెంటును ఏపీ ఎంపీలంతా స్తంభింపజేయాలని అంటున్నారు.