శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ttdj
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (14:13 IST)

చంద్రబాబు కళ్ళలో మెరుపు ఎందుకు..! ఒక్క రోజు ఆలస్యమైనా రూ.30 కోట్ల భారం!

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి తొలి విడత రూ.1,981కోట్ల రుణం మంజూరైంది. ఈ చెక్కును అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరాసరి ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి తొలి విడత రూ.1,981కోట్ల రుణం మంజూరైంది. ఈ చెక్కును అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరాసరి ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చారు. గౌతమిపుత్ర శాతకర్ణి పాటల విడదల కార్యక్రమంలో పాల్గొన్నారు. మరుసటి రోజు మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఈసారి చాలా ఉత్సాహంగా ఆనందంగా కనిపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి గంటకుపైగా మాట్లాడారు.
 
ప్రధానంగా పోలవరం గురించి మాట్లాడుతూ దశాబ్దాల కల సాకారం కాబోతుందని చెప్పారు. కేంద్రంతో సఖ్యతగా ఉండబట్టే ఈరోజు నిధులు సాధించుకోగలిగామన్నారు. నాబార్డు నిధుల గురించి చెబుతున్నప్పుడు ఆయన కళ్ళలో మెరుపు కనిపించింది. ఇదేసమయంలో నాబార్డు రుణానికి సంబంధించి అనేక ప్రశ్నలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో నెటిజన్స్ వీటిపైనే చర్చిస్తున్నారు. ఇంతకీ నాబార్డు రుణం తిరిగి చెల్లించాలా? అనేది సందేహం. నాబార్డు రుణాన్ని కేంద్రమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
 
పోలవరం ప్రాజెక్టు ప్రాధికార సంస్థ సిఈఓ అమర్‌జిత్‌ సింగ్‌ మీడియాకు చెప్పిన ప్రకారం.. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంలో 60 శాతాన్ని నాబార్డు ద్వారా కేంద్రమే ఇప్పిస్తుంది. అంటే ఈ మొత్తాన్ని కేంద్రమే తిరిగి నాబార్డుకు చెల్లిస్తుంది. మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు నుంచి రుణంగా తీసుకోవచ్చు. దీన్ని 15-20 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఏతా వాతా తేలేదంటే.. పోలవరానికి అయ్యే ఖర్చులో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నమాట. 
 
పోలవరం నిర్మాణ అంచనాపైనా తేడాలున్నాయి. 2011-12 అంచనాల ప్రకారం రూ.16 వేల కోట్లు అవుతుందని అంచనా ఉంది. ఈ అంచనాల మేరకే కేంద్రం నిధులు సమకూర్చనుంది. అయితే తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు అవసరమవుతాయి. రూ.16 వేల కోట్లు కూడా ఇవ్వకుండా అందులో 60 శాతం మాత్రమే కేంద్రం ఇస్తే రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది. ప్రాజెక్టు 2018 కల్లా ఎలా పూర్తవుతుంది. పైగా ప్రాజెక్టు నిర్మాణం ఒక రోజు ఆలస్యమైనా రూ.25 కోట్లు, రూ.30 కోట్లు అదనపు భారం పడనుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు. ఇలాంటి అనేక అనుమానాలు జనంలో ఉన్నాయి. వీటినన్నింటికీ చంద్రబాబే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.