శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: సోమవారం, 10 మే 2021 (17:57 IST)

కమల్ హాసన్‌కు టార్చర్ మొదలైంది, ఏం చేస్తారో?

మేకప్.. ప్యాకప్ అంతా ఈజీ కాదు. రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు ఉంటాయి. ఎన్నికల సమరంలో గెలిస్తేనే వెంట నలుగురు నాయకులు ఉంటారు. లేకుంటే అవకాశం ఉన్న దగ్గరకు వెళ్ళిపోతారు. అయితే ఈతత్వం కమలహాసన్ ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్లు అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో కమల్ పార్టీ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.
 
తమిళనాడును మార్చేస్తా.. రాజకీయాల్లో కొత్త చరిత్ర క్రియేట్ చేస్తా ఇవి తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ కామెంట్లు. కానీ సీన్ మారిపోయింది. రెండేళ్ళలోనే రాజకీయం అసలు తత్వం బోధపడినట్లు కనిపిస్తోంది. మక్కల్ నీతి మయ్యం అంటూ పార్టీ పెట్టిన కమల్ హాసన్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దగా ప్రభావం చూపలేదు.
 
అయితే తన టార్గెట్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలనే చెప్పారు కమల్. కానీ అసెంబ్లీ ఎన్నికల్లోను సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. పైగా కమల్ కూడా ఓడిపోయారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు కామన్. కానీ గెలుపు వెంటే నాయకులు ఉంటారు. అయితే అదే ఇప్పుడు కమల్ హాసన్ తెలుసొస్తున్న నిజం.
 
పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో నాయకులు బయటకు వస్తున్నారు. కమల్ హాసన్ పై విమర్సలు చేస్తున్నారు. ఎమ్ ఎన్ ఎం వైస్ ప్రెసిడెంట్ మహేంద్రన్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని విమర్సలు గుప్పించారు. ఇంకొందరు నేతలు కూడా అదే బాటలో ఉన్నారు.
 
అయితే ఫలితాలు వచ్చిన రెండురోజులకే నాయకులు వెళ్ళిపోవడంతో కమల్ హాసన్ అసంతృప్తిని బాహాటంగా వెలిబుచ్చుతున్నారట. నమ్మకద్రోహి అంటూ మండిపడుతున్నారట. కొందరికి స్వేచ్ఛ ఇవ్వకపోవడమే మంచిదని మహేంద్రన్ లాంటి వారు నిరూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మహేంద్రన్ ఒక్కరే కాదు మిగిలిన నేతలు కూడా కండువాలు మార్చేందుకు సిద్థమవుతున్నారట. ఇప్పటికే కొందరు పార్టీకి రాజీనామాలు కూడా చేసేశారు. పార్టీలు మారిపోతున్నారు. అటు వెండితెరపై కూడా కమల్ కు వెలుగులు లేవు. పెద్దగా హిట్లు రాలేదు. విశ్వరూపం చూపించే సినిమాలు కూడా రాలేదు. 
 
కనీసం పొలిటికల్ తెరపై సత్తా చాటుదామని అనుకున్నా సీన్ రివర్స్  అయ్యింది. డిఎంకే వెలుగులో కమల్ టార్చ్ లైట్ వెలుగులను జనం అస్సలు పట్టించుకోలేదు. ఎన్నికల్లో ఓటమి కంటే నాయకుల తీరే కమల్‌ను బాగా బాధించిందట. నాయకులే రాజీనామాలు చేస్తుండడంతో ఎంఎన్ఎం నౌక మునిగిపోతుందా.. ముందుకు సాగుతుందా..? దీంతో కమల్ పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో అస్సలు పార్టీనే వద్దు. జెండా పీకేద్దామన్న నిర్ణయంలో ఉన్నారంట కమల్ హాసన్.