శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:50 IST)

రమణ దీక్షితులు మళ్ళీ తిరుమల స్వామివారి చెంతకు...

దాదాపు 42 ఏళ్ల పాటు తిరుమల శ్రీవారికి విశేష సేవలందించిన రమణ దీక్షితులకు మళ్లీ స్వామి వారికి సేవ చేసుకునే అవకాశం దక్కుతోంది. 6 నెలల క్రితం అనూహ్యంగా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విధుల నుండి తొలగించబడిన శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు టీటీడీ ఈఓకు రెండురోజుల క్రితం లేఖ రాసారు. సోమవారం టిటిడి ఈవోకు రమణ దీక్షితులు ఈ అంశంగా పోన్ చేసి మాట్లాడారు. తాజాగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు మళ్ళీ ప్రధానార్చకుడిగా తనను విధుల్లోకి చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
అయితే దీనిపై న్యాయస్థానం ఆదేశాలు ఇంకా తమకు అందలేదని తీర్పు కాపీలు వచ్చిన తర్వాత స్పందిస్తానని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రమణ దీక్షితులకు స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు తిరుచానూరు అర్చకుల తొలగింపు విషయంలో జోక్యం చేసుకుని టీటీడీ నిర్ణయాన్ని తప్పు పట్టింది. తొలగించిన ఐదుగురు అర్చకులను తిరిగి తిరుచానూరు ఆలయంలో నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలన్నింటిలోనూ తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ఏఆలయంలో పనిచేస్తున్న అర్చకులు పూజారులు విషయంలో పదవీ విరమణ విధానం వయసుతో నిమిత్తం లేకుండా శారీరకంగా చక్కగా ఉండేవరకూ పనిచేసే దేవాలయాల్లో విధులు నిర్వహించే హక్కు పూజారులకు, అర్చకులకు ఉందని హైకోర్టు తీర్పు వెలువరించింది. 
 
దీంతో మళ్లీ రమణ దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. అయితే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు తరహాలో గతంలోనూ సుప్రీంకోర్టు వెలువరించింది. తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆలయం బొక్కసంలో పనిచేసిన డాలర్ శేషాద్రి విషయంలో సుప్రీంకోర్టు ఈ తరహా తీర్పును వెలువరించింది. ఈ మేరకు ఇప్పటికీ డాలర్ శేషాద్రి తిరుమల ఆలయం లోని ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం విధుల నుండి విరమణ పొందిన ఈయన ఇప్పటికీ ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనను కాంట్రాక్టు పద్ధతిలో అదే స్థానంలో కొనసాగిస్తోంది.
 
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివరణ కూడా ఇచ్చారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా టిటిడి ఈవో అనిల్ సింఘాల్ గారికి లేఖ రాసాము. ఫోన్ కాల్ ద్వారా మాట్లాడాము. అయితే వారు న్యాయస్థానం తీర్పు కాపీలు ఇంకా చేరలేదు... రాగానే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మాతో పాటు ఈ రోజున తిరుచానూరు ఆలయంలో పనిచేసే ఐదుగురు అర్చకులు కూడా ఈవోను కలిసి విన్నవించారు. దీనిపై టిటిడి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం అన్నారు.