గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Updated : శనివారం, 27 మే 2017 (21:11 IST)

సాహో... ఎన్టీఆర్, ఆయనే వుంటే ఆంధ్ర ఎలా వుండేది?

స్మృతి, విస్మృతి రెండూ కవల పిల్లలే. రెండూ మనల్ని వెంటాడుతూ సందర్భానుసారంగా మనకి మోదం, ఖేదం కలిగిస్తూ ఉంటాయి. ప్రజారంజకంగా పాలించిన మహా నాయకులు, తరాలు మారినా ప్రజల హృదయాల్లో ఒక చక్కని స్మృతిగా నిలిచిపో

స్మృతి, విస్మృతి రెండూ కవల పిల్లలే. రెండూ మనల్ని వెంటాడుతూ సందర్భానుసారంగా మనకి మోదం, ఖేదం కలిగిస్తూ ఉంటాయి. ప్రజారంజకంగా పాలించిన మహా నాయకులు, తరాలు మారినా ప్రజల హృదయాల్లో ఒక చక్కని స్మృతిగా నిలిచిపోతుంటారు. తెలుగు వాడి వాడిని, మాటల, చేతల వేడిని, తెలుగు నాడిని, పౌరుషాగ్నిని పుణికిపుచ్చుకున్న శ్రీ ఎన్టీఆర్ ఎన్నోకోట్ల తెలుగువారి మదిలో అలాంటి ఒక చక్కని స్మృతిగా, సజీవంగా నిలిచిపోయారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు.
 
వారిపై ఎన్నో వేనవేల కథనాలు వచ్చినా వారి జీవితాన్ని సమగ్రంగా చిత్రించలేదు. అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే, ఏ దశలోనూ రచనకి అందని జీవితం గడిపిన వ్యక్తి. జీవితం మొత్తం పూర్ణత్వం కొరకు పరితపించిన నిరంతర ప్రయాణీకుడు ఆయన. ఎన్టీఆర్ భౌతికంగా దూరమై ఒక తరం అయినా, ఆయన జీవితం, అందులోని విశేషాలు, తెలుగువారికి ఇంకా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూనే వున్నాయి, ఉంటాయి.
 
ఆయన జన్మదిన సందర్భంగా, ఈ రోజు ఆయన సాధించిన విజయాలు, చేరుకున్న మజిలీల గురించి మరొకమారు చెప్పబోవటం లేదు. ఈ రోజు తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం అన్నది ఒక అనివార్యమైన చారిత్రిక మజిలీ అయితే, తదనంతర పరిణామాల్లో ఎదుర్కొంటున్న సమస్యల్నిఎన్టీఆర్ ఎలా ఎదుర్కొనేవారు, తనదైన శైలిలో ఎలాంటి పరిష్కారం చూపించేవారు అన్న ఊహే ఈ వ్యాసం.
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న ఆంధ్రప్రదేశ్‌కి వున్న తక్షణ సమస్య రాజధాని లేకపోవడం అన్నది గత 3 సంవత్సరాలుగా అందరూ అనుకుంటున్నదే. రాజధాని నిర్మాణానికి సాయం కావాలి, అద్భుతమైన రాజధాని నిర్మించాలని పాలకులు ఎక్కని గడప, దిగని గడప లేదు. ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం మనమంతా చూస్తూనే వున్నాము. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నంత స్థాయిలో సాయం అందించటం లేదు. కేంద్ర నాయకత్వం అందరూ ఆశిస్తున్న ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు అన్నది ప్రజానీకంలో ఉన్న అభిప్రాయం.
 
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వుండి ఉంటే, ఆయన ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న ఆలోచనతో వేచి ఉండేవారు కాదు. విజయవాడలో పూరి గుడిసెలో అయినా, రేకుల షెడ్డులో అయినా సరే ఫర్వాలేదు నాకు కావలసినది ప్రజలతో మమేకం అవ్వటం. పరిపాలన కొరకు నేను వెళుతున్నా బ్రదర్, నాతో రండి అంటే ఆ స్ఫూర్తితో వసతులు, అవసరాలు, విధివిధానాలు పక్కన పెట్టి ఉద్యోగులూ ప్రజాసేవ అనే యజ్ఞంలో భాగమై ఆయనతో నడిచేవారు అన్నది అతిశయోక్తి కాదు! 
 
ఏ స్టార్ హోటల్స్ విజయవాడలో లేని రోజుల్లో, ఆనాడు నేషనల్ ఫ్రంట్ కాంక్లేవ్ కొరకు వాజపేయి, అద్వానీ, దేవీలాల్, చంద్రశేఖర్, వి.పి. సింగ్ తదితర రాజకీయ అతిరథ మహారథులైన నాయకుల్ని ఆహ్వానించి VTPS గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాను. ఎలా చేయాలన్న దానికంటే ఏమి చేయాలన్నది ఆయనకి ఎప్పుడూ ప్రధానంగా ఉండేది. ఎప్పుడైతే ఆయన ఒక రేకుల షెడ్డులో అయినా కూర్చొని తన పరిపాలన సాగిస్తారో తద్వారా ఏ విధమైన వసతులు లేక, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగించవలసి రావటం అన్నది, ఆంధ్ర ప్రజలకి జరిగిన అన్యాయం, వాస్తవ పరిస్థితుల తీవ్రత, దేశ వ్యాప్తంగా మీడియా, రాజకీయ, అధికార వర్గాల దృష్టికి వచ్చేది, అశాస్త్రీయంగా జరిగిన విభజన వైనంపై ఒక తీవ్ర చర్చకి దారితీసేది, కేంద్రంలో అధికారంలో వున్న పెద్దలకి పరిష్కారం చూపించవలసిన ఆగత్యాన్ని సృష్టించేది.
 
పరిమితమైన వనరులున్నా అపరిమితమైన విజయాల్ని సాధించవచ్చు, కావలసినది సమస్యపైన స్పష్టమైన అవగాహన,  నిజాయితీతో కూడిన నిరాడంబర కార్యాచరణ అనేది ఆయన త్రికరణశుద్ధిగా నమ్మిన విధానం. ప్రతి యేడు నష్టాలు చవిచూస్తున్న ఆప్కో సంస్థని చిన్న చిన్న విధివిధానాల మార్పుతో మొదటి సంవత్సరంలోనే షుమారుగా 3 కోట్ల లాభాల్లోకి నడిపించిన ఘనత ఆయనది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని, ఎరువుల కర్మాగారాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయటం, ఈ సందర్భంగా పాఠకులకి గుర్తు చేస్తున్నాను.
 
ఒక నటుడుగా వున్న తొలిరోజుల్లోనే, రాయలసీమ కరువు భాదితులని ఆదుకోవడం కోసం తన తోటి నటులతో కలిసి జోలె పట్టి నిధులు సేకరించిన 'ప్రజల కొరకు ప్రజల వద్దకి ప్రజల చేత' అన్న ఆయన సిద్ధాంతమే ఈ రోజు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రయోగించేవారు. పాలితులని పాలకులగా మార్చిన ఆయన ఘనతే సామాజిక విప్లవంలో ఆంధ్రప్రదేశ్‌ని మరొక మెట్టు ఎక్కించేది. 
 
ఈ రోజు చూస్తున్నాము మనం. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవిపై జరుగుతున్న తర్జనభర్జన! ఆ పదవికి ప్రాంతాలతో సంబంధం లేకుండా, నిబద్దతకి మారుపేరుగా నిలిచిన ఒక దళిత నాయకుడు, విద్యాధికుడు అయిన శ్రీ మోత్కుపల్లి నర్సింహులు వంటి నల్గొండ జిల్లా వ్యక్తికో, లేక నిజాయితీకి మారుపేరుగా నిలిచిన శ్రీ మండవ వెంకటేశ్వర్రావు లాంటి నిజామాబాదు నాయకుడికో, లేక రాజకీయాల్లో అన్నీ కోల్పోయిన జమ్మలమడుగు నాయకుడు శ్రీ రామసుబ్బారెడ్డి లాంటి మంచి వ్యక్తికో కట్టబెడుతూ ఒక్క నిమిషంలో నిర్ణయించేవారు.
 
అధికార వికేంద్రీకరణ, బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం, ఎంసెట్, 2 రూపాయలకి కిలో బియ్యం, లోకపాల్ బిల్, స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు, మహిళా విశ్వవిద్యాలయం, గిరిజన విద్యార్ధులకి స్కూల్స్, కాలేజీలు, తెలంగాణాలో పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేయటం లాంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఆయన చేసారన్నది అందరికీ తెలుసు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా వున్న కాలమంతా కేంద్రంలో అధికారం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి బలమైన కాంగ్రెస్ పాలకుల చేతుల్లో వున్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వారితో పోరాడుతూనే ఇన్ని చేసిన ఎన్టీఆర్ అదే కేంద్రంలో వాజపాయి, అద్వానీ లాంటి మిత్రులు అధికారంలో వుండిఉంటే ఇంకా ఎంత చేసేవారో అనేది ఊహకి అందని విషయం!
 
నాయకులని ఇతర పార్టీల నుండి ఆకర్షించటం అనేది నేటి రాజకీయం అయితే, అట్టడుగు బడుగుబలహీన వర్గాల నుండి, సామాన్య ప్రజల నుండి నాయకులని తయారుచేయటం శ్రీ ఎన్టీఆర్ రాజకీయ విధానం. తిరిగి అలాంటి నాయకులు తెలుగు ప్రజలకి రావాలి అని ఆశిస్తూ, మరొక్కసారి ఆయన జన్మదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు!
 
- సూరపనేని బసవేంద్ర,
ఉపాధ్యక్షులు,
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ, 
USA.