శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (16:07 IST)

గుజరాత్‌లో కమలం ఎదురీత? సంఘ్ పరివార్ సర్వేలో పచ్చినిజం!

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో సంఘ్ పరిపార్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కళ్లుబైర్లుకమ్మే నిజం వెల్లడైంది. ముఖ్యంగా ఈ యేడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎదు

భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో సంఘ్ పరిపార్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కళ్లుబైర్లుకమ్మే నిజం వెల్లడైంది. ముఖ్యంగా ఈ యేడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ ఎదురీత ఈదుతున్నట్టు తేలింది. ఇది కమలనాథుల గొంతులో పచ్చి వెలక్కాయపడిన చందంగా మారింది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీకి 52-60 సీట్లు మాత్రమే దక్కుతాయంటూ సంఘ్‌ నిగ్గు తేల్చింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ నిజాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు దిద్దుబాటు చర్యలకు దిగింది. 
 
ఇందులోభాగంగా, జపాన్‌ ప్రధాని షింజో అబేని హడావిడిగా తీసుకొచ్చి బుల్లెట్‌ ట్రైన్‌కు శంకుస్థాపన చేయడం, మోడీ పుట్టిన రోజు సందర్భంగా సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టును ప్రారంభించడంలాంటి చర్యలు చేపట్టింది. దీనికి నిదర్శనంగా గత నెల రోజుల వ్యవధిలో ఆయన మూడు దఫాలు గుజరాత్‌‌లో పర్యటించి, పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తున్నారు. 
 
ఇంత వ్యతిరేకత రావడానికి బలమైన కారణాలు లేకపోలేదు. రెండు దశాబ్దాల పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకతతో పాటు, పటేళ్ల రిజర్వేషన్ల సమస్య కూడా ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గోరక్షకుల పేరుతో దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఈ కారణంగా బీజేపీకి 9 శాతం దళిత ఓటర్లు దూరమైనట్టు ఈ సర్వే తేల్చింది. ఇక, మరో ప్రత్యామ్నాయం లేక గతంలో బీజేపీకి ఓట్లేసిన ముస్లింలలో చాలామంది ఈసారి కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. 
 
ఇక, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేసిన జీఎస్టీ చట్టాన్ని గుజరాత్ వస్త్రవ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నైరాశ్యాన్ని పోగొట్టి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ‘మిషన్‌-150’ నినాదంతో ఈసారి ఎన్నికలకు వెళ్లాలని మోడీ - షాల ద్వయం వ్యూహాలు రచిస్తోంది.