1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2015 (16:39 IST)

మరుభూమిగా మారుతున్న శేషాచల కొండలు.. రక్తమోడుతున్న అటవీ ప్రాంతం

సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి కొలువున్న శేషాచల కొండలు మరుభూమిగా మారుతున్నాయి. ఒక వైపు గొడ్డళ్ళ వేటుకు భారీ వృక్షాలు మొదలు సాధారణ చెట్ల వరకూ నేలకొరుగుతుంటే తుపాకీ గుళ్ళకు ఎర్ర కూలీలు మృత్యువు పాలవుతున్నారు. ఇటు పోలీసులు అంటు స్మగ్లర్లకు మధ్య అత్యాశకు పోయిన కూలీల రక్తంతో తడిసి ముద్దవుతోంది. మరోవైపు ఫారెస్టు సిబ్బంది స్మగ్లర్ల చేతిలో మరణిస్తున్నారు. శేషాచల అడవులు దద్దరిల్లుతున్నాయి. ప్రతీ ఏడు ఈ శేషాచల పరిసర ప్రాంతాలలో ఎన్ కౌంటర్ లేదా హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. 
 
స్వాతంత్ర్యం రాకమునుపు నుంచే ఈ ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. చైనా, జపాన్ వంటి దేశాలలో ఈ కొయ్యకు విపరీతమైన గిరాకీ ఉండడంతో ఎప్పటి నుంచో అక్రమ రవాణా సాగుతోంది. ఈ క్రమంలో అటవీశాఖ, స్మగ్లర్లకు మధ్యన ఘర్షణ జరుగుతూనే ఉంది. కడప చిట్వేలి సమీపంలోని అటవీ ప్రాంతంలో స్వాతంత్ర్యానికి మునుపు ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో అటవీశాఖ కేశవులు, పెచలయ్య, మరో ఒకరు మరణించారు. అనంతరం కొద్ది కాలం ఎర్రచందనం రవాణా పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు జరగలేదు. అయితే నాలుగేళ్ళ కిందట శేషాచల అడవుల చివరి ప్రాంతమైన కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోబోయిన ఓ తాత్కాలిక ఉద్యోగిని స్మగ్లర్లు వాహనంతో  ఢీకొట్టించి చంపేశారు. 
 
అంతకంటే ముందు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వద్ద అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు ఓ అధికారిని వాహనంతో తొక్కించి చంపేశారు. ఇక అక్కడ నుంచి ఘర్షణ వాతావరణం జరుగుతూనే ఉంది. 2013 డిసెంబర్ 15న తిరుమలలో స్మగ్లింగ్ సమాచారాన్ని అందుకున్న డిప్యూటీ ఫారెస్టు రేంజర్ ఎన్ ఆర్ శ్రీధర్, అసిస్టెంట్ బీట్ ఆపీసర్ డేవిడ్ కరుణాకర్, మరో గార్డు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే చెట్లు నరుకుతున్న 200 కూలీలు అక్కడే ఉన్న స్మగ్లర్ల ప్రేరేపణతో ముగ్గురిపై దాడి చేసి చంపేశారు.  ఇక అక్కడ నుంచి ఈ స్మగ్లింగును అరికట్టే వ్యవహారం పోలీసుల చేతికి వెళ్లింది. 
 
 
ఇక 2014 మొదట్లో కడప జిల్లా కోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో తిరుమలకు వెనుకభాగంలో కళ్యాణీ నది వద్ద పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు మరణించారు. ఇక్కడ రాళ్లు రువ్విన దాఖలాలు కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు జరిపిన కాల్పులు ముగ్గురు హతమయ్యారు. అదే సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో కూడా ఇలాంటి సంఘటనే అదే జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలో జరిగింది. అక్కడ కూడా పోలీసులు ఇద్దరు స్మగ్లర్లను కాల్చి చంపారు. 
 
ఇక చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో శ్రీవారి మెట్టుకు సమీపంలో శామల అటవీక్షేత్రంలో 2014 డిసెంబర్ లో జరిగిన కాల్పులలో ఇద్దరు స్మగ్లర్లు మరణించారు. చంద్రగిరి మండలంలోని నాగయ్య గారి పల్ల సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒకరు మరణించారు. అంతకు మునుపు 2013లో కాలూరు క్రాస్ వద్ద శ్రీనివాస మంగాపురం సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన ఓ కూలీ మరణించారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు సమీపంలో జరిగిన మంగళవారం నాటి ఎన్ కౌంటర్ లో ఏకంగా 20 మంది హతం కావడం విశేషం. వీరంతా కూడా తమిళనాడుకు చెందిన వారే. ఇలా శేషాచలం అడవులు నిత్యం ఎన్ కౌంటర్లతో రక్తమోడుతూనే ఉన్నాయి.