1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PNR
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (14:37 IST)

తెలంగాణలో ఎన్టీఆర్ పేరు విన్పించరాదా... టి అసెంబ్లీ తీర్మానం.. చిత్తు కాగితమేనా?

హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న దేశీయ టెర్మినల్‌కు దివంగత నేత, స్వర్గీయ నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) పేరు పెట్టడంపై తెలంగాణ రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై ఒక తీర్మానం కూడా చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీర్మానం చదివి వినిపించారు. అదేంటంటే... 
 
"రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ శాసనసభ విచారం వ్యక్తం చేస్తోంది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతున్నాం. రాష్ట్ర అభిప్రాయం తెలుసుకోకుండా పేరు పెట్టడం మంచిది కాదు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాజీవ్‌గాంధీ పేరునే కొనసాగించాలి. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసి, రాష్ట్రాన్ని సంప్రదించి పేరు మార్పుపై నిర్ణయం తీసుకోవాలి" అంటూ పాఠాన్ని చదివిన కేసీఆర్ ఈ మేరకు కేంద్రాన్ని కోరుతున్నట్టు తెలిపారు. అయితే, ఈ తీర్మానాన్ని టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీలు ఆమోదించాయి. 
 
అంతకుముందు ఈ పేరు మార్పుపై కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా నేతల పేర్లను రుద్దడం సరికాదన్నారు. తెలంగాణలో పక్క రాష్ట్రం వాళ్ల పేర్లు ఎందుకు అని ప్రశ్నించారు. ఉన్న పేర్లను తీసేయాలని ఇక్కడి ప్రజల డిమాండ్.. ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ పేరును శంషాబాద్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కు పెట్టడం సమంజసం కాదన్నారు. 
 
ఆంధ్రాలో నాలుగు ఎయిర్‌పోర్టులున్నాయి. నాలుగింటికి ఎన్టీఆర్ పేరును పెట్టుకోండని సూచించారు. ఆ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తమకు చరిత్ర లేదా.. ఒక వేళ పేరు మార్చాల్సి వస్తే తెలంగాణ వారి పేర్లు పెట్టుకుంటామన్నారు. పేరు మార్పు విషయంలో కేంద్రం తెలంగాణను సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి.. ఆయనను విమర్శించడం లేదు.. ఆయన జీవితంపై చర్చ కాదు.. ఎన్టీఆర్ పేరు పెట్టడమే సమస్య అని సీఎం వివరించారు. పైగా.. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. 
 
ఎన్టీఆర్ పేరుపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చ, తీర్మానంపై సీమాంధ్ర నేతలు తమదైనశైలిలో విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చేయడానికి వీల్లేదంటూ సమైక్యాంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ (మెజార్టీ సభ్యులు) ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే.. ఆ తీర్మానం చిత్తు కాగితంతో సమానమని, ఈ తీర్మానం చెత్తబుట్టలో వేసేందుకు కూడా పనికిరాదంటూ కేసీఆర్ సహా, టీ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించిన విషయాన్ని వీరు ఇపుడు గుర్తుచేస్తున్నారు. 
 
ఇపుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్టీఆర్ పేరుపై చేసిన తీర్మానం కూడా చిత్తు కాగితంతో సమానం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక విమానాశ్రయంలోని ఓ టెర్మినల్‌కు పేరు మార్చడాన్ని తెలంగాణకు చెందిన కాంగ్రెస్, తెరాస నేతలు తప్పుబట్టం విచిత్రంగా ఉందని సీమాంధ్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. ఐనా రాజకీయాలకు అతీతుడు, తెలుగు వారికి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్ పేరు తెలంగాణలో వినిపించకూడదా... అంటూ ప్రశ్నిస్తున్నారు.