శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2016 (16:43 IST)

అఖిలేష్ యాదవ్ పైన చేతబడి చేయించిన చిన్నమ్మ...? పని చేసిందా? ఫలితం వస్తుందా? యూపీ రౌండప్

ఉత్తరప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి.. రామాయణ, మహాభారతాలకు లింకుపెట్టేశారు.. నెటిజన్లు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్నసమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదిరి పాకనపడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్య

ఉత్తరప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి.. రామాయణ, మహాభారతాలకు లింకుపెట్టేశారు.. నెటిజన్లు. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్నసమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదిరి పాకనపడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అమర్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మా కుటుంబంలో కలహాలకు అమర్ సింగ్ కారణం అని ఫైర్ అయ్యారు. 
 
దీంతో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కొంతకాలంగా ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. అఖిలేష్ యాదవ్ తన చిన్నాన్న శివపాల్ యాదవ్‌తో సహా నలుగురు మంత్రులపై వేటు వేశారు. అంతేకాకుండా బహుభాషా నటీ, మాజీ ఎంపీ జయప్రదను ఎఫ్‌డీసీ నుంచి తొలగించి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ తతంగాన్నంతా నెటిజన్లు రామాయణ, మహాభారతాలతో పోల్చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ తండ్రి పట్ల దుర్యోధనుడిగా వ్యవహరిస్తున్నాడని కొందరంటే.. ములాయం సింగ్ యాదవ్‌ని ధృతరాష్ట్రుడితో పోల్చేస్తున్నారు మరికొందరు. అలాగే తండ్రి మాటను వింటూనే పార్టీ భవితవ్యం కోసమే అఖిలేష్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడని ఇంకొందరు చెప్తున్నారు. 
 
ఇకపోతే.. రామాయణంతో అఖిలేష్ యాదవ్- ములాయం సింగ్ యాదవ్‌ల స్టోరీకి మ్యాచ్ చేసేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎలాగంటే..? కైకేయి తన కుమారుడికి పట్టం కట్టడం కోసం దశరథుడి పెద్ద కుమారుడైన శ్రీరాముడిని అడవులకు పంపుతుంది. ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కూడా ఇంచుమించు అదే పరిస్థితి కొనసాగుతోందని టాక్. 
 
ములాయం సింగ్ యాదవ్‌కు రెండోభార్య సాధన గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. ఆమె పేరు బాగానే వినిపిస్తోంది. ఆమె అఖిలేష్ యాదవ్‌పై చేతబడి చేయించారని కూడా ఆరోపణలు వచ్చాయి. చేతబడి మాట ఎలా ఉన్నా.. తన కొడుకు ప్రతీక్ యాదవ్‌కు పట్టం కట్టాలని ఆమె కంకణం కట్టుకున్నారు. కానీ పెద్ద భార్య కొడుకైన అఖిలేష్ అయితే సమర్థుడన్నది ములాయం అభిప్రాయం. ఇక వదినమ్మ సాధనకు మరిది శివపాల్ యాదవ్ మద్దతు ఉండటంతోనే అఖిలేష్ ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ములాయం ఏం చేయాలో తోచక తలపట్టుకుని కూర్చున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
ఇకపోతే.. 2003లో ములాయం మొదటి భార్య మాలతీ యాదవ్ తుదిశ్వాస విడిచారు. అప్పటి నుంచి సాధన అధికారికంగా ములాయం భార్యగా చలామణి అయ్యారు. కానీ వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో సంబంధం ఉంది. 1988లో వారిద్దరికీ పుట్టిన బిడ్డే ప్రతీక్ యాదవ్. వాస్తవానికి అతడికి రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా, తల్లి మాత్రం ఆతనిని బాగా ప్రోత్సహించేవారు. 
 
2012 అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పార్టీలో కొంతమేరకు ముసలం మొదలైంది. ఎన్నికల తర్వాత ములాయం సింగ్ యాదవే సీఎం కావాలని సాధన, శివపాల్ కోరుకున్నారు. కానీ ములాయం మాత్రం.. తన రాజకీయ వారసుడిగా, యూపీ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్‌నే ప్రతిపాదించారు. అప్పట్లోనే కొందరు ఎమ్మెల్యేలను అఖిలేష్‌కు వ్యతిరేకంగా సాధన ఎగదోశారని టాక్. 
 
2012లో ఎన్నికల సంగతిని పక్కనబెట్టి.. పార్టీలో ఆమే కలకలం సృష్టించారని సన్నిహిత వర్గాల సమాచారం. అందుకే అమర్ సింగ్‌ను పార్టీలోకి తీసుకున్నారని.. సాధన కుమారుడికి రాజకీయాలంటే పడకపోవడంతోనే.. కోడలు అపర్ణా యాదవ్‌ను రంగంలోకి దింపారు. రాబోయే ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి అపర్ణా యాదవ్‌ పోటీ చేస్తారని అంటున్నారు.
 
బహుశా అక్కడి నుంచి ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన రీటా బహుగుణ జోషి పోటీచేసే అవకాశముంది. ఈ విషయాలన్నీ తెలియగానే అఖిలేష్ యాదవ్ కూడా చురుగ్గా కదిలారు. సాధనకు, శివపాల్ యాదవ్‌కు సన్నిహితులైన గాయత్రి ప్రజాపతి, రాజ్‌ కిశోర్ సింగ్‌లను తన కేబినెట్ నుంచి తొలగించారు. అదే రోజే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్‌ను కూడా తప్పించారు. 
 
దీనిపై శివపాల్ యాదవ్ వెంటనే తన అన్న ములాయం వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడంతో ఆయన అఖిలేష్ నుంచి పార్టీ అధ్యక్ష పదవి ఊడబీకి తన తమ్ముడికి కట్టబెట్టారు. మొత్తానికి ఇలా సాధనా యాదవ్ పుత్రప్రేమ యూపీ అధికార పార్టీ కుటుంబంలో ముసలానికి దారితీసింది.
 
ఇదిలా ఉంటే.. భారతదేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన యూపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కుటుబ సభ్యులు, సొంత పార్టీ నేతలు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మీద తిరుగుబాటుకు దిగారు. ప్రతిపక్షాలు బీఎస్పీ, కాంగ్రెస్ యూపీ సర్కారుపై ఫైర్ అవుతున్నాయి. 2017లో జరిగే ఎన్నికలను వీరు టార్గెట్ చేసుకుని ఫ్యామిలి డ్రామా ఆడుతున్నారని విమర్శిస్తున్నాయి.
 
అయితే అందుకు భిన్నంగా బీజేపీ స్పందించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ సమర్థవంతంగా పని చేస్తున్నాడని, అలాంటి యువ నాయకుడు ఆ రాష్ట్రానికి అవసరం అని బీజేపీ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు శతృఘ్న సిన్హా కొనియాడారు.
 
మరోవైపు సమాజ్ వాదీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలకపరిణామాలు చోటుచేసుకొన్నాయి. కొత్త పార్టీని పెట్టడం లేదని యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. తనపై కొందరు చేసిన విమర్శలు ఎంతో బాధించాయన్నారు. సీఎం పదవి నుంచి తాను తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. మరి యూపీ రాజకీయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచిచూడాలి.