శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By PYR
Last Updated : సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (13:50 IST)

బలిపీఠంపై నవ్యాంధ్ర భవిష్యత్తు.. దాగుడుమూతలాడుతున్న తేదేపా, భాజపా

మీరు విభజన ఆందోళనలో ఉన్నారు.. బాలాజీ దేవుడి సాక్షిగా చెప్పుతున్నా... నన్ను నమ్మండి.. బంగారు భవిష్యత్తు కల్పిస్తా... చంద్రబాబును గెలిపించండి. మేము సాయం చేస్తాం.
                                                                                      - ఎన్నికల ముందు తిరుపతి సభలో నరేంద్ర మోడీ
 
ఆంధ్రప్రదేశ్ స్వర్ణంధ్రా చేస్తా.. నరేంద్ర మోడీజీ పిఎం అవుతారు.. అడినన్ని నిధులు తెప్పిస్తా.. ఉద్యోగాల వర్షం కురిపిస్తా... పరిశ్రమలకు బాట వేస్తా.. హైదరాబాద్ తలదన్నేలా రాజధానిని నిర్మిస్తా... 
                                                                                                                   - అదే సభలో చంద్రబాబు 
 
వీరిని నమ్మేగా జనం ఓట్లేశారు.. వీరి నమ్మే కదా తమ బంగారు భవిష్యత్తు వారి చేతుల్లో పెట్టారు. మరి ఇప్పుడు ఏమైంది. ఈ ఇద్దరు ఏరు దాటాక తెప్ప తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాదు పోటీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు జనాన్ని మోసం చేయడానికి తయారవుతున్నారు. కేవలం రాజకీయాలతో... మాటలతో కాలం గడుపుతున్నారే తప్ప, ఎక్కడా ఏ కోశానా వారు చేసిన హామీలను నెరవేర్చే పరిస్థితులలో లేరు. వీరి ఇద్దరి నడుము ఆంధ్రప్రదేశ్ రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతోంది. వీరిని ఎందుకు నమ్మామా అనే సమయం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ బీజేపీలు విడాకులు తీసుకోవడానికి తెగ ఆరాటపడుతున్నాయి. ఈమధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వీటినే చెబుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పరిశీలకులు ఆందోళన చెందే పరిస్థిత ఉత్పన్నమవుతోంది. కలిసికట్టుగా పనిచేసి నవ్యాంధ్రను నిర్మించాల్సిన పార్టీలు ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడంలో బీజీబీజీగా ఉన్నారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 
 
విభజన చట్టంలో ఆంధ్ర జనాన్ని ఊరట చెందించిన అంశం పదేళ్ళ ప్రత్యేక హోదా. వాస్తవానికి ఆ ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ అయినా భుజానికెత్తుకుని తామే దాన్ని సాధించినట్లు, ఇంకా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నీ చేస్తామని బీజేపీలో చెప్పని నాయకుడు లేదు. దీనిని ఢంకా భజాయించి చెప్పిన నేత వెంకయ్య నాయుడు. ఈ ఊరు ఆ ఊరు తేడా లేకుండా సందు సమావేశాలలో కూడా ఇదే పదే పదే చెప్పారు.

ఇది మోడీ మాటగా కూడా తెలుగులోకి తర్జుమా చేసి మరీ వివరించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంత సులభం కాదు. అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలని అని మొదట సన్నాయి నొక్కులు నొక్కారు. ఆపై  ఏమంటున్నారో తెలుసా...! ప్రత్యేక హోదా సాధ్యం కాని పని అది ఇవ్వలేం... అంటున్నారు. ఇలా బీజేపీ మోసం చేస్తే దాన్ని ప్రశ్నించి, పట్టుబట్టి సాధించాల్సిన చంద్రబాబు ‘ ఏం చేస్తున్నారు.. వారు ఇవ్వలేరట ’ అనే చెప్పి.. చాలా సులభంగా తీసుకుని, భవిష్యత్తులో బీజేపీపై సంధించడానికి ఓ అస్త్రంగా దానిని తన అమ్ములపొదిలో పెట్టుకున్నారు. 
 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటులోకి వెళ్ళుతుందని నాడు సీమాంధ్ర వాసులు వాదిస్తే లోటును భరిస్తామని నాటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా చట్టం చేసింది. ఈ సందర్భంగా బీజేపీకి, కాంగ్రెస్ కు మధ్య పెద్ద రగడే నడిచింది. లోటును ఒక్క ఆర్థిక సంవత్సరం భరిస్తామని రాజ్యసభలో అప్పటి మంత్రి జయరామ్ రమేష్ చెబితే నేటి మంత్రి వెంకయ్య నాయుడు ఐదేళ్ళు భరించాలని పదేపదే డిమాండ్ చేశారు. అది సాధ్యం కాకపోవడంతో పార్లమెంటు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడాదికే చట్టం చేసింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే మిగిలిన నాలుగేళ్లు కూడా ఆర్థిక లోటును భరిస్తామని చెప్పారు. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కనీసం రూ. లక్షకోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వీరి మాటలు నమ్మిన జనం వారినే అధికార పీఠమెక్కించారు. మరి నేడు జరుగుతున్నదేంటి? నాలుగేళ్ల సంగతి దేవుడెరుగు.. కనీసం చట్టంలో పేర్కొన్న మొదటి ఏడాది కూడా నయా పైసా ఇవ్వమని తేల్చేశారు. ఇక్కడ కూడా చంద్రబాబు కేంద్రంపై నోరు మెదపకుండా, కాలు కదపకుండా రాజకీయ నాటకాలు ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇప్పటివరకూ బీజేపీ ఏమి ఇవ్వకపోగా, కాంగ్రెస్ చేసిన చట్టంలోని అంశాలను కూడా కేంద్రం అమలు చేయడం లేదు. ఇక వారితో కలిసి నడిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ జనాన్ని నమ్మించిన చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తు పదిలంగా ఉంచుకోవడానికే చూస్తున్నారు. బీజేపీ ఏమి ఇవ్వడం లేదని అంశాన్ని చాలా చక్కగా ఇటు ఉద్యోగుల పీఆర్సీ ఆలస్యం చేసేందుకు, జనంపై భారం మోపేందుకు ఉపయోగించుకుంటున్నారు. వీటన్నింటిని తన అవసరాల కోసం బీజేపీపైకి అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఢిల్లీ అహంకారానికి వ్యతిరేకంగా పుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచిన పార్టీలలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక స్థానం ఉంది. మరి అదే తెలుగుదేశం పార్టీ నేడు బీజేపీని నిలదీయడానికి ఏం చేస్తోంది..? ఇదే ఇప్పుడు ప్రశ్న...!!