1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (09:46 IST)

ప్రత్యేక హోదాపై టీడీపీ ప్లానేంటి..? ఏం చేయబోతోంది.

ప్రత్యేక హోదా పేరు చెబితే తెలుగుదేశం పార్టీ గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రత్యేక హోదాతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దాడితో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ప్రత్యేక హోదా ఉపద్రవం నుంచి తప్పించుకోవడానికి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రాన్ని నొప్పించకుండా.. ప్రతిపక్షాల నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. 
 
ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే సాయం 90శాతం గ్రాంటుగా.. 10శాతం రుణంగా వస్తుంది. ఈ హోదావల్ల వచ్చే లాభం ఇదే. కాని ఈ లాభం ఇస్తూనే ఇటువంటి గ్రాంటు ఏడాదికి రూ.3 వేల కోట్లకు మించరాదని ఒక పరిమితిని విధించారు. ఇదికాక కేంద్రం ప్రణాళికా గ్రాంటులో కొంత భాగం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు వస్తుంది. ఇది వీలు కాని పరిస్థితులలో విదేశాల నుంచి తెచ్చుకొనే రుణాల్లో 70శాతం కేంద్రం గ్రాంటుగా ఇచ్చేలా రాయితీ తెచ్చుకోగలిగితే దానివల్ల ఏడాదికి రూ.9 వేల నుంచి 10 వేల కోట్ల లబ్ధి చేకూరుతుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 
 
ఇలాంటి రాయితీని కేంద్రం ఇస్తే విదేశాల నుంచి తెచ్చుకొనే రు ణాలను కూడా ఇంకా పెద్ద ఎత్తున తెచ్చుకోవచ్చునని, దీనిపై కూడా తాము కసరత్తు చేస్తున్నామని ఆ వర్గాలు వివరించాయి. కానీ కేంద్రం రెండింటికి మొండి చేయి చూపితే, ఏం చేయాలి? అనేది తెలుగుదేశం పార్టీ ఎదుట ఉన్న పెద్ద సమస్య. అందుకే ఏం చేయాలని యోచిస్తోంది. కేంద్రానికి తలొగ్గితే ప్రతిపక్షాలు చేసే ఆందోళనలతో రాష్ట్రంలో ఇరుకున పడాల్సి ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ భావన. ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలి. ? 
 
ఇప్పటికే ఇటు రఘరామ రాజన్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఒత్తిడిని సాకుగా చూపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం ససేమిరా అంటోంది. వీటికి విరుగుడుగా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయాలన్న ఆలోచన కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహా కూడా తీసుకొన్నారు. పిటిషన్‌ వేయవచ్చని న్యాయ నిపుణులు సలహా ఇచ్చారు. కానీ.. కేంద్రంలోని పెద్దలకు ముందుగా చెప్పి వారి ఆమోదం తీసుకొన్న తర్వాతే కోర్టుకు వెళ్ళడం సరైన మార్గమని, దీనివల్ల కోర్టులో జరిగే వాదనల్లో పరోక్షంగా కేంద్రం సాయం లభించే అవకాశముందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తంపై ప్రత్యేక హోదాపై తెలుగుదేశం కసరత్తు చేస్తోంది.