సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: బుధవారం, 5 మే 2021 (14:20 IST)

ప్రధాని మోదీ ఇమేజ్‌ను తలకిందులు చేస్తున్న కరోనావైరస్, ఆ రాష్ట్రంలో బిజెపికి షాక్

కరోనావైరస్ ను హ్యాండిల్ చేయడంలో ఎన్డీఏ సర్కార్ విఫలమైందంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. ప్రపంచ దేశాలు సైతం భారతదేశంలో రోజువారీ నమోదవుతున్న కేసులు, ఇక్కడి పరిస్థితులు చూసి ఆందోళన పడుతున్నాయి. కరోనావైరస్ కారణంగా ప్రధానమంత్రి మోదీ ఇమేజ్ తలకిందులైందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనికితోడు ఎన్నికల్లో వరుసగా భాజపాకి గట్టి దెబ్బలు తగులుతున్నాయి.
 
యుపిలోను బిజెపి ప్రతిష్ట మసకబారుతోందంటున్నారు. స్థానిక ఫలితాలు యోగి ఆదిత్యనాథ్ సర్కారుకి షాకిచ్చాయంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యోగి సర్కార్ ఎదురీత తప్పదని చెపుతున్నారు. అయోధ్య స్థానిక ఎన్నికల ఫలితాలు బిజెపికి పెద్ద షాకే ఇచ్చిందట. ఈ ఎన్నికల్లో విపక్షాలైన సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీలు అధిక శాతం సీట్లు గెలుచుకున్నాయి.
 
చాలా చోట్ల నెక్ టు నెక్ కనిపించింది. ప్రధానంగా సిఎం సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో ఎస్పీ గట్టి పోటీ ఇచ్చింది. అయోధ్యలో 40 స్థానాలకుగాను బిజెపి ఆరు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమాజ్ వాదీపార్టీ 24 చోట్ల, బిఎస్పీ 5 చోట్ల విజయాలను సాధించాయి. మధురలో అయితే 33 స్థానాలకు గాను కేవలం 8స్థానాలను బిజెపి గెలిచినట్లు తెలుస్తోంది.
 
ఇక్కడ బిఎస్పీ 13 స్థానాల్లో గెలుపొందగా ఆర్జెడి, ఎస్పీ చెరో స్థానంలో విజయం సాధించాయి. గోరఖ్ పూర్‌లో 60 స్థానాలకు గాను బిజెపి, ఎస్పీలు చెరో 20 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక ఆప్, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఒక్కో స్థానంలో గెలుపొందాయి.
 
రాష్ట్రంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉందంటున్నారు ఎస్పీ నేతలు. రానున్న అసెంబ్లీ ఫలితాల్లో ఇవే ఫలితాలు పునరావృతమవుతాయంటున్నారు. 2017లో మోదీ ప్రభంజనంతో యుపిలోను బిజెపి మంచి మెజారిటీని సాధించింది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతికూల పవనాలు, వెంటనే యుపి స్థానిక సంస్ధల ఎన్నికల్లో బిజెపికి గట్టి దెబ్బే తగిలిందని చెప్పొచ్చంటున్నారు విశ్లేషకులు.