గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: బుధవారం, 28 ఆగస్టు 2019 (15:35 IST)

రెండు రోజుల ముందుగానే శ్రీవారి విఐపి టిక్కెట్లు పొందొచ్చు.. ఎలా?

వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో దళారీ వ్యవస్ధను సమూలంగా మార్పు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టిటిడి ఛైర్మన్, తిరుమల టిటిడి ప్రత్యేకాధికారి ఇద్దరూ కలిసి టిటిడి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. వీరికి టిటిడి ఈఓ కూడా తోడయ్యారు. ఎప్పుడూ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ సామాన్య భక్తులకు అవసరమయ్యే నిర్ణయాలు తీసుకునే అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పుడు కొత్త ఆలోచనలో ఉన్నారట.
 
అదే విఐపి టిక్కెట్ల వ్యవహారం. ప్రోటోకాల్ విఐపిలు తిరుమలకు వస్తే ముందురోజు తిరుమల జెఈఓ కార్యాలయంలో సిఫారసు లేఖలను ఇవ్వాలి. ఆ లేఖలను చూసిన తరువాత ఆ రోజు రాత్రికి టిక్కెట్లను టిటిడి జెఈఓ కేటాయిస్తారు. ఇది మామూలుగా జరిగే ప్రక్రియే. ఒక్కోసారి టిక్కెట్లు రాకుండా కూడా ఉండొచ్చు. దీంతో వచ్చిన విఐపి కాస్త నిరాశతో దర్సనం కాకుండానే వెనుదిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి.
 
అయితే ఇక నుంచి ఆ పరిస్థితి లేకుండా ఆన్‌లైన్ ద్వారా విఐపి టిక్కెట్లను ఇచ్చేయాలన్న ఆలోచనకు వచ్చేసింది టిటిడి. ఇది ఎంతవరకు సాధ్యమన్న విషయంపై సాంకేతిక నిపుణులతో చర్చిస్తున్నారు టిటిడి ఈఓ. ప్రోటోకాల్ విఐపి తిరుమలకు రావాలంటే రెండు రోజుల ముందుగానే ఆన్‌లైన్‌లో తన సిఫారసు లేఖలను మెయిల్ ద్వారా జెఈఓ కార్యాలయానికి పంపించాలి. ఆ లేఖను చూసిన తరువాత జెఈఓ కార్యాలయ సిబ్బంది రద్దీని బట్టి టిక్కెట్లును కేటాయిస్తారు. దీంతో ఆ విఐపి తన ప్రయాణాన్ని ఖచ్చితంగా నిర్థారించుకోవచ్చు.
 
తనకు టిక్కెట్లు వస్తే నేరుగా తిరుమలకు వచ్చి టిక్కెట్టు తీసుకోవచ్చు. అలాగే గదుల కేటాయింపు కూడా ఉంటుంది. టిక్కెట్లు రాకుంటే రద్దీ లేని సమయంలో మళ్ళీ మెయిల్ ద్వారా ధరఖాస్తు చేసుకుంటే టిటిడి సమాధానం ఇస్తుంది. దీంతో విఐపిలు గంటల తరబడి జెఈఓ కార్యాలయానికి వచ్చి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మరి ఇది వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.