శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (11:41 IST)

వైజాగ్‌పై సీఎం జగన్ చూపుతున్నది నిజమైన ప్రేమేనా? ఎందుకంటే....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలు దాటింది. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజోపయోగ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా, విశాఖపట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పలు కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అలాంటివాటిలో లూలూ గ్రూపు, ఆదానీ గ్రూపులు ఉన్నాయి. ఈ కంపెనీలతో గత తెదేపా ప్రభుత్వం చేసిన ఒప్పందాలను రద్దు చేశారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి, విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రకటించారు. దీనిపై వైజాగ్ ప్రజలు ఆశ్చర్యంతోపాటు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే.. విశాఖలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీలను వెనక్కి పంపే జగన్.. విశాఖను ఎలా అభివృద్ధి చేస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై వారు పలు సంఘటనలను ఉదహరిస్తున్నారు. 
 
అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్‌గా విశాఖను అభివృద్ధి చేస్తామని.. విశాఖపై వల్లమాలిన ప్రేమ చూపుతున్న వైసీపీ ప్రభుత్వం... అదే విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలకే ఝలక్ ఇవ్వడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వ రద్దు పాలనలో ఓ వింత వాదనను కూడా ఆ పార్టీ మంత్రులు తెరపైకి తెస్తున్నారు. 
 
టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నీ అవినీతితో కూడుకున్నవని.. తాము అందుకే ఒప్పందాలను, ప్రాజెక్టులను, కాంట్రాక్టులను రద్దు చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. లులూకు టీడీపీ హయాంలో కేటాయించిన భూముల్లో కూడా అవినీతి జరిగిందనేది వైసీపీ ప్రభుత్వ మంత్రుల వాదన. 
 
అయితే.. ఈ వాదనపై సామాన్య ప్రజానీకం నుంచి మేధావుల వరకూ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భూ కేటాయింపులో అక్రమాలు జరిగాయని భావిస్తే విచారణ జరపాలి లేదా తక్కువకే ఇచ్చారనుకుంటూ ధర పెంచాలి. అవసరమైన దానికంటే ఎక్కువ కేటాయించారని భావిస్తే... తగ్గించుకోవాలి. ఏది ఏమైనా... ఆయా కంపెనీలతో చర్చలు జరపాలి. అలాకాకుండా, ఒక్కో సంస్థను దూరం చేసుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
ఇక... ఇదే విశాఖలోనే దశల వారీగా రూ.70వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు గతంలో అదానీ గ్రూప్‌ ముందుకు వచ్చింది. ఇప్పుడు దీనిని రూ.3500 కోట్లకు పరిమితం చేసింది. పదేళ్లలో దశలవారీగా పెట్టే పెట్టుబడులకు ఇప్పటి నుంచే భారీగా భూములు అప్పగించడం సరికాదని ప్రభుత్వం భావించింది. కేటాయింపులు తగ్గించేసింది. 
 
ఈ నేపథ్యంలోనే అదానీ తన పెట్టుబడుల పరిమాణాన్ని కూడా తగ్గించుకున్నట్లు సమాచారం. ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న రద్దు నిర్ణయాలతో ఏపీ భవిష్యత్ ఏంటన్న ప్రశ్న అక్కడి ప్రజల్లో తలెత్తుతోంది. సంక్షేమ తాయిలాల మాటున అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పనిచేయడమేంటన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పెట్టుబడి పెట్టాలని భావించిన లులూ గ్రూప్ కర్ణాటకకు తరలిపోయింది. లులూ విషయంలో విశాఖకు జరిగింది అన్యాయమేనని విజ్ఞులైన ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైంది.