శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pyr
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2015 (16:46 IST)

కాంగ్రెస్ పరివార్ సాధ్యమా...! జగన్ కు గాలం వేస్తున్నారా...!!

నిన్నటి వరకూ రాహూల్ ఆచూకీ కోసం సతమతమైన కాంగ్రెస్ పార్టీ ఆయన స్పీడును చూసి తెగ ముచ్చట పడిపోతోంది. అదే సమయంలో తమ నుంచి విడిపోయిన వారందరిని ఒక గూటికి చేర్చాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి విడిపోయిన పిల్ల కాంగ్రెసులన్నింటిని కలుపుకుని తిరిగి జవసత్వాలను పుంజుకోవాలని చూస్తోంది. ఏకంగా కాంగ్రెస్ పరివార్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ కు గాలం వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి అది సాధ్యమా.. అంటే.. ! ప్రశ్నార్థకమే. 
 
జనతా పరివార్ ను చూసిన కాంగ్రెస్ కు కళ్ళ పొరలు తొలిగిపోయినట్లుంది. అందుకే అందరం కలిసి పోదాం అంటు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారందరినీ ఒకసారి గుర్తు చేశాడు. ఇదిలా ఉండగానే రాయబారాలు కూడా నడుపుతున్నట్లు సమాచారం. ఎన్సీపీ అధినేత శరద్ పవార్  కూడా మాట్లాడాడట !  కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన వారు కలవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. అప్పటి వరకూ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేసిన పవర్ ఆ అవకాశం రాకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ బాటలోనే పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
కాంగ్రెస్ పరివార్ కు ఈయన మొదటి సభ్యుడు కావాచ్చుగాక.. ఆయన తన పార్టీని విలీనం చేయవచ్చుగాక, మిగిలిన వారు రావడం అంత సులభమా..!. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సత్తాను చాటిన వారిలో తృణమూల్ దీదీ పార్టీ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రముఖమైనవి. అటు చారిత్రాత్మక పాలనను సాగించిన వామపక్షాల వెన్నులు వణుకు పుట్టించి దీదీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అధికార పీఠాన్ని ఎక్కి కూర్చుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలను అనుక్షణం దడ పుట్టించింది. పుట్టిస్తూనే ఉంది. ఈ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ ను పరిగణలోకి కూడా తీసుకోలేదు.  
 
ఇలాంటి పరిస్థితులలో జగన్ కాంగ్రెస్ పిలువగానే పరుగెత్తుకుంటూ వెళ్ళతాడా అనేది అనుమానం. ఆయనను అడుగడుగునా అవమానపరిచి, ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ తో ఇప్పుడు దోస్తీ చేయాల్సిన అవసరం జగన్ కు ఉందా.. అనేది కూడా పెద్ద ప్రశ్న. కాకపోతే దిగ్విజయ్ కు వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీకి జగన్ పై విమర్శలు చేయడానికి ఇదో అవకాశంగా మాత్రమే మిగలవచ్చు గానీ, కాంగ్రెస్ పరివార్ ఎండమావి మాత్రమే అవుతుందని రాజకీయ పరిశీలకుల అంచనా.. పూర్తిగా బీజేపీ హవా నడుస్తున్న సమయంలో పరివార్ ప్రయత్నం పరిహాసం అవుతుందేమో..