శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 మే 2015 (14:13 IST)

'మహానాడు'కు జూ.ఎన్టీఆర్‌ను పిలిచారా...? వదిలేశారా...? తెదేపా పగ్గాలు లోకేష్‌కేనా...?!!

తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు స్థాపించినప్పటికీ ఆ పార్టీలో నందమూరి కుటుంబానికి బాలకృష్ణ తప్ప మిగిలినవారికి ప్రాధాన్యం కల్పించలేదనే విమర్శలు వున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గత మహానాడు జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదనే అంశంపై పెద్ద రభస జరిగింది. కానీ ఈసారి ఆ ఊసే లేదు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకునేవారే లేకుండా పోయారు. 
 
అసలు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిచారా.. లేదా అనే అనుమానం కూడా ఉన్నది. ఒకవేళ పిలిస్తే జూ.ఎన్టీఆర్ రాలేదా...? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరోవైపు జూ.ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా ఓ సాధారణ నాయకుడిలా మహానాడుకు హాజరయ్యారు. మొత్తమ్మీద నందమూరి తాకిడికి పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు కనబడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు. 
 
మహానాడులో నారా లోకేష్ పొడిపొడిగా మాట్లాడినప్పటికీ నాయకులతో పూర్తి టచ్ లో ఉన్న నేతగా ఎదుగుతున్నారు. పార్టీ కీలక నేతలంతా ఆయనదే లోకంలా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీలో కీలక పదవిని నారా లోకేష్ బాబుకు త్వరలోనే అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ శ్రేణుల్లో ఎవరు భవిష్యత్ నేత అనేదానిపై అనుమానాలుండేవి. కానీ ఆ పరిస్థితి నుంచి చంద్రబాబు క్రమంగా నారా లోకేశ్ భవిష్యత్ నేత అనేలా పరిస్థితిని మార్చేశారు. 
 
నారా లోకేష్ విషయంలో ఎన్టీఆర్ అభిమానుల నుంచి, కుటుంబం నుంచి వ్యతిరేకత రాకుండా, జూనియర్ ఎన్టీఆర్ విషయంపై ఎవ్వరూ మాట్లాడకుండా వుండే విధంగా బాబు పక్కా ప్లాన్ చేశారనే కామెంట్లు వినబడుతున్నాయి. టాకింగ్ పవర్ అంతగా లేదనే విమర్శలు వస్తున్న నేపధ్యంలో లోకేశ్ తన టాలెంట్ ఎలా చూపించగలడన్నది వేచి చూడాల్సి ఉంది.