సీఎం హోదాలో వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ.. ఏం చెప్పబోతున్నారు!?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 8వ తేదీన కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొనబోతున్నారు. ఇదేరోజు జమ్మలమడుగు వేదికగా రాష్ట్రస్థాయి రైతు సదస్సు జరపాలని యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా ఈ నియోజకవర్గం నుంచే నవరత్నాల్లోని పలు పథకాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కాగా.. సీఎం హోదాలో వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించడం ఇది రెండోసారి. కాగా జమ్మలమడుగులో పర్యటించడం మొదటిసారి. అంతేకాదు ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఇలా బహిరంగ సభల్లో పాల్గొనడం కూడా మొదటి సారేనని చెప్పుకోవచ్చు.
అయితే జగన్ రాకకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు తరలిరానున్నారు. దీంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇప్పటికి జిల్లాకు చెందిన మంత్రి అంజద్ బాషా సభా స్థలం పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఏం చెప్పబోతున్నారు..?
అయితే.. ఈ బహిరంగ సభ వేదికగా జగన్ ఏం చెప్పదలుచుకున్నారు..? జిల్లాపై.. ముఖ్యంగా నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తారా..? లేకుంటే రాష్ట్ర ప్రజలకు శుభవార్త ఏమైనా చెబుతారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు వెలువరిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలు విత్తనాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సభాముఖంగా రైతన్నలకు విత్తనాలు.. నవరత్నాల్లోని పలు పథకాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై మాత్రం ఇంతవరకూ క్లారిటీ రాలేదు.
ఖనిజ నిక్షేపాల కోసం నమూనాల సేకరణ....
తీవ్ర వర్షాభావంతో పంటల్లేక పనుల్లేక చాలామంది వలస వెళుతున్నారు. చదువుకున్న యువత ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతున్నారు. వీరంతా పరిశ్రమలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలుచోట్ల ఖనిజ నిక్షేపాల కోసం జరుగుతున్న సర్వేలు నిరుద్యోగుల్లో ఆశలు నింపుతున్నాయి. సర్వే బృందాలు రిగ్గులు వేసి మరీ ఆయిల్ నిక్షేపాలు, ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. ఇదిలావుంటే.. గత ఏడాది జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాళెం మండలాల పరిధిలో హెలికాఫ్టర్ ద్వారా రోజుల తరబడి సర్వే సాగింది. రెండు నెలల క్రితం కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదేరీతిలో హెలికాఫ్టర్ రోజూ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఏదో సర్వే నిర్వహిస్తున్నారనే చర్చ అప్పుడు జిల్లా ప్రజల్లో సాగింది. ఈ వ్యవహారం అంతా ముగిసిన తర్వాత వైఎస్ జగన్ జమ్మలమడుగులో పర్యటిస్తుండటం గమనార్హం.
కాగా.. ఇదే జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డి కలిసిపోయి పోటీచేశారు. కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున ఆది, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి పోటీ చేయగా ఇద్దరూ కూడా ఘోర ఓటమిని చవిచూశారు. ఈ ఇద్దరు అభ్యర్థులపై వైసీపీ నుంచి పోటీ చేసిన వారు భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే.