'తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి.. లోకమంతా తిరిగే.. వటే...' (Bathukamma Video Song)

ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండగ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. సాధారణంగా ఆశ్వయుజ మాసంలో

bathukamma festival
pnr| Last Updated: మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (11:47 IST)
"పువ్వుల జాబిలివే.. పున్నమి వాకిలివే
చీకటికే రంగులు పులిమావే...

తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే.. వటే...

పాల సంద్రం పూలే.. పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించేనే....

రేలారే రేలారే రేలా రేలా రేలారే... "

ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండగ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు. సాధారణంగా ఆశ్వయుజ మాసంలో నిర్వహించే శరన్నవరాత్రులు. ఆటపాటల నేపథ్యంగా, నిత్య జీవన రీతికి అనుగుణంగా ఈ సంబరాల్ని కొనసాగిస్తారు. ‘ప్రకృతి స్వరూపిణి’గా అమ్మతల్లిని భావించి, వివిధ పుష్పాలతో పేర్చి ‘బతుకమ్మ’గా ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది.

ప్రాణశక్తి, ప్రాణధాత్రి, ప్రాణేశ్వరి అనే ఆదిశక్తి నామాలకు ప్రతిబింబం.. బతుకమ్మ. బతుకునివ్వడంతో పాటు, సకల ప్రాణులకూ జీవశక్తిని అందజేసే ప్రకృతి, ఆకృతి- బతుకమ్మ. రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగులతో సింగారించుకొనే బంగరు కల్పవల్లిగా బతుకమ్మను జానపదులు భావిస్తారు.
ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులు పరచి, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి అక్కడే తంగేడు, బీర, గన్నేరు, నిత్య మల్లె, బంతి వంటి పుష్పాల్ని క్రమానుగతంగా పేర్చుతారు. అదే పువ్వుల దొంతరపై తమలపాకులో పసుపు గౌరమ్మను అలంకరిస్తారు. ఆ పుష్ప సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు.

మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ, చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, సామాజిక జీవన రీతులు, కుటుంబాల అనుబంధాలు, పురాణగాథలు, ఇతిహాస ఘట్టాల్ని వారు పాటల రూపంలో ఆలపిస్తారు. ‘పసుపుబొట్టు’ పేరిట తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటారు. బతుకమ్మను పసుపు, కుంకుమలతో ఆరాధించి వివిధ రకాల పదార్థాల్ని నివేదన చేస్తారు. ఆటపాటల అనంతరం, ప్రతినిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయడం ఈ సంప్రదాయంలో ఒక భాగం! తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సందడి విలసిల్లుతుంది.

ఈ తొమ్మిది రోజుల్లో మొదటి, రెండో రోజుల్లో బొడ్డెమ్మగా, మూడో రోజు లక్ష్మీదేవిగా, నాలుగో రోజు గౌరమ్మగా ఆరాధిస్తారు. అయిదో రోజు అట్ల బతుకమ్మగా, ఆరో రోజు అలిగిన బతుకమ్మగా, ఏడో రోజు చకినాల బతుకమ్మగా, ఎనిమిదో రోజు దుర్గమ్మగా, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా ఆరాధించడం సంప్రదాయం. తొమ్మిది రోజులూ గౌరీదేవి ‘పూలమ్మ’గా పుట్టింటికి తరలి వచ్చినట్లు భావిస్తారు. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను భావిస్తూ, గీతాల ద్వారా ఆరాధనను వెల్లడిస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మకు సాగనంపు వేడుక నిర్వహిస్తారు.

ఈ యేడాది బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెరాస మహిళా నేత, నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓ పాటను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే కోటి మంది వరకు చూశారు. ఆ పాట వీడియోనూ మీరూ చూడండి.
దీనిపై మరింత చదవండి :