మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 16 ఏప్రియల్ 2022 (11:06 IST)

హనుమజ్జయంతి: ఆంజనేయుని కరుణాకటాక్షాల కోసం....

Hanuma
అంజనాదేవి, వాయుదేవుడు ఆంజనేయుని మాతాపితరులు. తల్లిదండ్రులు ఆంజనేయునికి పెట్టిన మొదటి పేరు ‘మనోజవ’ అని, అంజనీ పుత్రుడు కావున ‘ఆంజనేయుడని’, వాయుదేవుని కుమారునిగా ‘మారుతి’ అనే పేర్లు ఆ స్వామికి వచ్చాయి. హనుమంతుడు వైశాఖమాసంలో బహుళ దశమి, శనివారం కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఈ శుభ తిథిని హనుమజ్జయంతిగా జరుపుకుంటారు. 

 
ఈ పుణ్య దినాన భక్తులు హనుమంతుని ఆలయాలకు వెళ్ళి స్వామిని పూజించి వడమాలలను వేసి, అప్పాలను స్వామికి సమర్పిస్తారు. తమలపాకులతో హనుమంతుడిని పూజిస్తారు. ఈ శుభదినాన సుందరకాండను పారాయణ చేసినట్లయితే హనుమంతుని కృపను పొందవచ్చు. ఆలయాల్లోనే గాక, గృహాల్లో కూడా ఆ స్వామిని భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో, శుచిశుభ్రతలతో పూజించవచ్చు. 

 
వైశాఖ బహుళ నవమి నాడు రాత్రి ఉపవాసం ఉండి, నేలపై చాప పరుచుకొని నిద్రించాలి. మర్నాడు దశమి నాడు తెల్లవారు జామునే లేచి తల స్నానం చేయాలి. గడపలను పసుపు కుంకుమలతో అలంకరించి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. పూజ గదిలో ప్రత్యేకంగా ఒక చిన్న స్టూలు మీద గానీ, పీట మీద కానీ హనుమంతుని పటాన్ని ఉంచాలి. 

 
హనుమంతుని ఉంచే ఆసనానికి పసుపు రాసి, కుంకుమతోను, బియ్యపు పిండితోను బొట్లను పెట్టి, పీఠం మధ్యలో బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. హనుమంతుని విగ్రహానికి లేక పటానికి సింధూరాన్ని పెట్టాలి. ఆంజనేయుడు సింధూరాన్ని ఇష్టపడతాడు గనుక సింధూరపు అలంకరణ వల్ల స్వామి వారి కటాక్ష వీక్షణాలు భక్తులకు కలుగుతాయి. విగ్రహానికి ఎర్రని వస్త్రాన్ని ధరింపజేయాలి.

 
ఆంజనేయుని పూజకు ఎర్రని పూలు, కుంకుమ కలిపిన ఎర్రని అక్షింతలు ఉపయోగించాలి. హనుమంతుని పూజ చేయబోయే ముందు పసుపుతో చేసిన వినాయకుడిని ముందుగా పూజించాలి. ఆ తర్వాత ఆంజనేయుడిని పూజిస్తే చక్కని ఫలితం లభిస్తుంది. తాము చేపట్టిన కార్యాలు, తాము అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. ఆంజనేయ స్వామిని షోడశోపచారాలతో అష్టోత్తరం చదువుతూ ఎర్రని పుష్పాలతోను, తమలపాకులతోను పూజించాలి. 

 
వడలతో తయారుచేసిన మాలను హనుమంతుని మెడలో అలంకరించాలి. పూజ పూర్తయిన తరువాత ఆత్మ ప్రదక్షణ నమస్కారంతో మన ఆలోచనలను, చిత్తాన్ని భగవంతుని మీదనే నిలుపుకోవాలి. పూజానంతరం స్వామికి అప్పాలు, ఉడికించిన సెనగలు, అరటిపండ్లు, వడలు, పొంగలిని కానీ లేదా పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి. హనుమంతుడు శ్రీరామునికి ప్రియ శిష్యుడు. మహా భక్తుడు. కావున హనుమజ్జయంతి నాడు శ్రీరాముడిని పూజిస్తే, హనుమంతునికి ఆపార ఆనందం కలుగుతుంది. తన స్వామిని పూజించిన వారి పట్ల హనుమంతుడు ప్రసన్నుడవుతాడు.

 
హనుమంతుడిని పూజిస్తే గ్రహ పీడలు నశించిపోతాయి. గాలి, ధూళి లాంటివి హనుమంతుని దర్శనం, ప్రార్ధన, భజన, హనుమాన్ చాలిసా, ఆంజనేయ దండకం పఠించడంతోనే పారిపోతాయి. హనుమంతుడు బలశాలి, ధీరుడు, కార్యశూరుడు. అటువంటి స్వామిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.