మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (18:20 IST)

వొడాఫోన్ ఐడియాకి కుమార్ 'మంగళం'?, అమ్మేస్తాను మహాప్రభో అంటూ...

వొడాఫోన్, ఐడియాలో దాదాపు 27 శాతం వాటాను కలిగి ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా, అప్పులతో నిండిన వొడాఫోన్ ఐడియా(విఐఎల్) లో తన వాటాను ప్రభుత్వానికి లేదా కేంద్రం ఎంచుకున్న ఏవైనా సంస్థకు అప్పగించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఆదాయం కన్నా అప్పులు పెరిగిపోవడంతో తమకు అది గుదిబండలా మారిందని, కనుక గౌరవప్రదంగానే దాన్ని వదలించుకోవాలన్న యోచనలో కుమార్ మంగళం వున్నారు. జియో-ఎయిర్ టెల్ ఇస్తున్న పోటీకి వొడాఫోన్ నిలదొక్కుకోలేకపోతోంది.
 
మరోవైపు ప్రభుత్వం మరియు టెలికాం కంపెనీల మధ్య రెవెన్యూ-షేరింగ్‌పై రెండు దశాబ్దాలుగా నెలకొన్న వివాదం కారణంగా వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మినహా అన్ని కంపెనీలు తట్టాబుట్టా సర్దుకున్నాయి.
 
టెలికాం కంపెనీలు తమ ఆదాయంలో ఒక శాతాన్ని లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. వారి ప్రకారం, అద్దె, హ్యాండ్‌సెట్‌ల అమ్మకం లేదా రోమింగ్ ఛార్జీల వంటి కోర్ -కాని వ్యాపారాలు వారు ఒక శాతం చెల్లించే ఆదాయంలో చేర్చరాదు - వారు తమ ప్రధాన వ్యాపారం ద్వారా సంపాదించిన ఆదాయాన్ని మాత్రమే చెల్లించాలనుకుంటున్నారు. ప్రభుత్వం స్పష్టంగా వేరే విధంగా ఆలోచిస్తుంది.
 
ప్రస్తుతం VIL మార్కెట్‌ విలువ రూ.24 వేల కోట్లు. అధికారిక గణాంకాల ప్రకారం, వీఐఎల్ రూ .58,254 కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాలి. ఇందులో కంపెనీ రూ .7854.37 కోట్లు చెల్లించగా ఇంకా రూ.50,399.63 కోట్లు బాకీ పడి ఉంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని కంపెనీ బోర్డు గత సెప్టెంబరులో నిర్ణయించి కాలికి బలపం కట్టుకుని తిరిగినా ప్రభుత్వ హామీ లేనిదే పెట్టుబడులు పెట్టేందుకు ఏ సంస్థ ముందుకు రాలేదు. దీనితో కంపెనీ విలువ కంటే అప్పులే ఎక్కువై గుదిబండలా మారింది. ఈ పరిస్థితుల్లో కంపెనీలోని తన వాటాల్ని వదులుకోవడమే సరైన నిర్ణయమని భావించిన బిర్లా తమ 27 కోట్ల మంది వినియోగదారుల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
 
బిర్లా తన లేఖలో వొడాఫోన్ ఐడియా ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ నేపధ్యంలో వోడాఫోన్‌ను మూసివేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా కంపెనీని జాతీయం చేయడాన్ని ఎంచుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ వొడాఫోన్ ఐడియాను మూసివేయడానికి అనుమతిస్తే రిలయన్స్ జియో- భారతీ ఎయిర్‌టెల్ మధ్య రెండు గుర్రాల రేసు ప్రారంభమవుతుంది.
 
ఈ పోటీలో కూడా ఎవరైనా ఓడితే ఇక వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే వాదన వుంది. డేటా ఖర్చులు ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా మార్కెట్‌గా మారాయి. ఐతే భవిష్యత్తులో మరింత ప్రియమైనవి కావచ్చు. మరి ప్రభుత్వ నిర్ణయం ఏమిటో చూడాల్సి వుంది.