బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2020
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 2 మార్చి 2021 (20:12 IST)

పతంజలి కరోనిల్: కరోనావైరస్‌కు విరుగుడు అనే ప్రచారంలో నిజమెంత?

కరోనావైరస్ మీద తమ కరోనిల్ ప్రభావవంతంగా పనిచేస్తుందనే తాజా ప్రకటనలతో.. ఈ వివాదాస్పద మూలికా చూర్ణం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ కరోనిల్‌ను ఇటీవల కేంద్ర మంత్రులు కొందరు హాజరైన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. కానీ ఇది పనిచేస్తుందనటానికి ఎటువంటి ఆధారాలూ లేవు. దీని వినియోగానికి అనుమతికి సంబంధించి తప్పుదారిపట్టించే వాదనలు వినిపిస్తున్నారు.
 
కరోనిల్ గురించి మనకు ఏం తెలుసు?
సంప్రదాయ భారతీయ ఔషధాల్లో ఉపయోగించే పలు మూలికలను కలిపిన చూర్ణం ఇది. దేశంలో ఒక పెద్ద వినియోగ వస్తువుల సంస్థ ‘పతంజలి’ దీనిని ‘కరోనిల్’ అనే పేరుతో విక్రయిస్తోంది. ఈ చూర్ణం మొదట గత ఏడాది జూన్‌లో బయటకొచ్చింది. కోవిడ్-19ను ‘‘నయం’’ చేస్తుందని ఎటువంటి ఆధారం లేకుండా చెప్పుకొచ్చారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ దీని గురించి ప్రచారం చేశారు.
 
కానీ.. ఇది కోవిడ్‌ చికిత్సలో పనిచేస్తోందని చెప్పటానికి ఎటువంటి సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పటంతో దీనిని మార్కెట్ చేయటం నిలిపివేయాల్సి వచ్చింది. అయితే.. దీనిని ‘రోగ నిరోధక శక్తిని పెంచేది’గా అమ్ముకోవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. సదరు కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మరో కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనిల్ అనేది.. కోవిడ్-19ను నిరోధించగలదని, నయం చేయగలదని ఆ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.
 
ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ పాల్గొనటాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విమర్శించింది. ఆరోగ్యశాక సమక్షంలో ‘అశాస్త్రీయ ఔషధా’న్ని ప్రచారం చేయటం ‘భారత ప్రజలకు అవమానం’ అని ఐఎంఏ అభివర్ణించింది. ఆ మూలికా చూర్ణాన్ని ‘నయం చేసే మందు’గా ఆయన మద్దతిస్తున్నారో లేదో స్పష్టంచేయాలని కోరింది. ఆ కార్యక్రమంలో హర్ష వర్ధన్ పాల్గొనటం గురించి అడగటానికి ఆరోగ్యశాఖను మేం సంప్రదించాం. కానీ ఈ కథనం ప్రచురించే సమయం వరకూ ఎటువంటి స్పందనా రాలేదు. మంత్రి హాజరవటాన్ని పతంజలి కంపెనీ సమర్థించుకుంది. ‘‘ఆయన ఆయుర్వేదాన్ని సమర్ధించనూలేదు.. ఆధునిక వైద్యాన్ని తక్కువా చేయలేదు’’ అని వ్యాఖ్యానించింది.
 
కరోనిల్ గురించి ఏం ప్రచారం చేస్తున్నారు?
కోవిడ్-19 మీద తమ ఉత్పత్తి పనిచేస్తుందని ఆ కంపెనీ ఉద్ఘాటిస్తూనే ఉంది. ‘‘ఇది జనానికి చికిత్స చేసింది, నయం చేసింది’’ అని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బీబీసీతో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన శాస్త్రీయ పరీక్షల ఫలితాలు పలు జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయని, వాటిని చూడాలని మాకు చెప్పారు. ప్రత్యేకించి.. 2020 నవంబర్‌లో లేబరేటరీ ప్రయోగాల ఆధారంగా నిర్వహించిన అధ్యయనం.. స్విట్జర్లాండ్ కేంద్రంగా నడుస్తున్న ఎండీపీఐ అనే జర్నల్ ప్రచురించిందని ‘పతంజలి’ సంస్థ ఉటంకించింది.
 
అయితే.. ఆ అధ్యయనాన్ని చేపల మీద నిర్వహించారు. మనుషుల్లో కరోనావైరస్‌ను కరోనిల్ నయం చేస్తుందని ఆ అధ్యయనం చెప్పటం లేదు. ‘‘ప్రస్తుత ప్రీ-క్లినికల్ అధ్యయనం ద్వారా సేకరించిన ఫలితాలు.. మనుషుల మీద సమగ్ర క్లినికల్ ట్రయల్స్ నిర్వహించటం అవసరమని చెప్తున్నాయి’’ అని ఆ అధ్యయనం పేర్కొంది. లేబరేటరీలో ప్రీ-క్లినికల్ ట్రయల్స్ నిర్వహించటానికి, మనుషుల మీద పనిచేసే ఔషధానికి నియంత్రణ సంస్థల ఆమోదం పొందటానికి మధ్య భారీ తేడా ఉందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో ప్రంపచ ఆరోగ్య రంగ నిపుణుడు డాక్టర్ మైకేల్ హెడ్ బీబీసీకి చెప్పారు.
 
‘‘ప్రయోగశాలలో చాలా ఔషధాలు పనిచేయవచ్చుననే భరోసా చూపుతాయి. కానీ మనుషుల మీద పరీక్షించినపుడు.. అనేక కారణాల వల్ల అవి పనిచేయవు’’ అని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది మే, జూన్ నెలల మధ్యలో.. కరోనావైరస్ పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్ధారించిన 95 మంది రోగుల మీద హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించారు. వారిలో 45 మందికి ఈ చూర్ణం ద్వారా చికిత్స చేశారు. మిగతా 50 మందికి ఎటువంటి మందూ ఇవ్వలేదు.
 
ఆ ప్రయోగం ఫలితాలను సైన్స్ డైరెక్ట్ అనే జర్నల్‌లో 2021 ఏప్రిల్ సంచికలో ప్రచురించినట్లు పతంజలి కంపెనీ చెప్పింది. కరోనిల్ తీసుకోని వారికన్నా.. కరోనిల్ తీసుకున్న వారు వేగంగా కోలుకున్నారని ఆ సంస్థ పేర్కొంది. అయితే.. ఇది చిన్న సాంపుల్‌తో కూడిన పైలట్ అధ్యయనం మాత్రమే. రోగులు కోలుకోవటంలో తేడాలకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు కాబట్టి.. ఈ అధ్యయనం నుంచి స్థిరమైన నిర్ధారణలకు రావటం కష్టం.
 
కరోనిల్‌కు ఏదైనా అధికారిక ఆమోదం లభించిందా?
ఉత్తరాఖండ్ రాష్ట్రం కేంద్రంగా ఉన్న పతంజలి కంపెనీ.. కరోనిల్‌కు ప్రస్తుతం ‘రోగ నిరోధక శక్తిని పెంచేది’ అనే పేరుతో ఉన్న లైసెన్స్‌ను.. ‘కోవిడ్-19కు మందు’ లైసెన్స్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కోవిడ్‌కు వ్యతిరేకంగా ‘మద్దతునిచ్చే చర్య’గా తమ ఉత్పత్తికి ఆమోదం లభించిందని పతంజలి కంపెనీ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. కరోనిల్‌కు తాము కొత్త లైసెన్సును జారీ చేశామని రాష్ట్ర అధికారులు బీబీసీకి నిర్ధారించారు. కానీ కోవిడ్‌కు ‘నయం చేసే మందు’గా లైసెన్స్ ఇవ్వలేదని స్పష్టంచేశారు.
 
‘‘కొత్త లైసెన్స్ అర్థం ఏమిటంటే.. దీనిని జింక్, విటమిన్-సి, మల్టీ విటమన్లు లేదా ఇతరత్రా సప్లిమంటెరీ ఔషధాల తరహాలో దీనిని కూడా విక్రయించవచ్చునని’’ అని రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ అయిన సంప్రదాయ వైద్య విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.ఎస్.రావత్ బీబీసీకి చెప్పారు. ‘‘అది (కరోనిల్) నయం చేసే మందు కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ధృవీకరణ పథకాలకు అనుగుణంగా తమకు ‘గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్టిఫికెట్’ (జీఎంపీ) కూడా ఉందని పతంజలి కంపెనీ చెప్తోంది. ‘‘కరోనిల్‌ను డబ్ల్యూహెచ్ఓ కూడా గుర్తించింది’’ అంటూ పతంజలి సంస్థ సీనియర్ అధికారి రాకేశ్ మిట్టల్ ఒక ట్వీట్‌లో కూడా చెప్పుకొచ్చారు. అయితే.. పతంజలి సంస్థ చెప్తున్న జీఎంపీ ధృవీకరణ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన కార్యక్రమం కింద భారత ఔషధ నియంత్రణ సంస్థ జారీచేసిన ధృవీకరణ. ఇది.. ఎగుమతి అవసరాల కోసం ఉత్పత్తి ప్రమాణాలు తగినవిధంగా ఉండేలా చూడటానికి సంబంధించిన ధృవీకరణ మాత్రమే.
 
‘‘ఒక ఔషధం సామర్థ్యం అంశానికి, జీఎంపీ ధృవీకరణకు ఎటువంటి సంబంధం లేదు. తయారు చేసే సమయంలో న్యాయతా ప్రమాణాలు ఉండేలా చూడటానికి సంబంధించిన ధృవీకరణ’’ అని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డాక్టర్ రావత్ వివరించారు. ‘‘కోవిడ్-19 చికిత్స కోసం ఎటువంటి సంప్రదాయ ఔషధమైనా సమర్థవంతంగా పనిచేస్తోందని మేం ధృవీకరించలేదు’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బీబీసీకి నిర్ధారించింది. ‘‘కోవిడ్-19కు చికిత్స చేయటానికి కానీ, అది రాకుండా నివారించటానికి కానీ ఈ ఉత్పత్తి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పటానికి ప్రస్తుతం స్పష్టమైన ఆధారం ఏదీ లేదు’’ అని సౌతాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ హెడ్ పేర్కొన్నారు.