గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (16:53 IST)

కుమార్తె కాలేయాన్ని తండ్రికి అమర్చిన వైద్యులు.. అరుదైన ఆపరేషన్.. ఎక్కడ?

liver transplant
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి వడపళని శాఖలో 63 యేళ్ల వృద్ధుడికి కాలేయ మార్పిడి అరుదైన చికిత్స చేశారు. కుమార్తె కాలేయాన్ని తండ్రికి అమర్చారు. ఈ విషయాన్ని ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ వివేక్ విజ్ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తాము ఇప్పటివరకు 2500కు పైగా వివిధ రకాల అవయవ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కానీ కుమార్తె దానం చేసిన కాలేయాన్ని తండ్రికి అవయవ మార్పిడి చికిత్స చేయడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. 
 
ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్ డాక్టర్ స్వాతి రాజు మాట్లాడుతూ కాలేయం దెబ్బతినడంత ఆరు నెలలుగా తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుడు తమ ఆస్పత్రిలో చేరినపుడు తక్షణమే ఆపరేషన్ చేయాల్సివచ్చిందన్నారు.
liver transplant


ఆ సమయంలో బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి సేకరించిన కాలేయం అందుబాటులో లేకపోవడంతో ఆయన బంధువుల నుంచి దానంగా ఇచ్చిన కాలేయాన్ని తీసుకోవాలని భావించామన్నారు.
 
ఆ తర్వాత ఆ వృద్ధుడికి చెందిన ఇద్దరు కుమార్తెలను పరీక్షించామని, అందులో చిన్న కుమార్తె ఇచ్చిన అవయవాన్ని సేకరించి అవయవ మార్పిడి చికిత్స చేసినట్టు తెలిపారు. 18 నుంచి 50 యేళ్ళ లోపువారు కాలేయంలో కొంతభాగాన్ని దానం చేసిన ఆరు వారాల్లో కాలేయభాగం మళ్లీ పెరుగుతుందన్నారు. ప్రస్తుతం రోగితోపాటు దాత కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు చెప్పారు.