శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (20:29 IST)

గాలి ద్వారా కరోనా వైరస్ ... 4.8 మీటర్ల దూరంలో ఉన్నా డేంజరేనట...

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ తలమునకలైవున్నాయి. అయితే, ఈ వైరస్ మాత్రం మానవ ప్రయత్నాలకు ఏమాత్రం లొంగేలా కనిపించడం లేదు. ఈ వైరస్ గురించి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త వార్త వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ వైరస్ గాలిద్వారా కూడా వ్యాపిస్తుందని పరిశోధకులు తేల్చారు. 
 
పైగా, 2 మీటర్ల సామాజిక భౌతిక దూరంతో ఎలాంటి ప్రయోజనం లేదని వారు తేల్చారు. గాలి ద్వారా కరోనా వైరస్ 4.8 మీటర్ల దూరం వరకు వ్యాపిస్తుందని వారు చెబుతున్నారు. అందువల్ల ప్రస్తుతం పాటిస్తున్న భౌతికదూరం సరిపోదని ప్రపంచవ్యాప్తంగా ఈ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని వైరాలజీ నిపుణులు సూచిస్తున్నారు.
 
నిజానికి కరోనా వైరస్ గాలిద్వారా కూడా వ్యాపిస్తుందని ఆరంభం నుంచి ఓ సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇదే అంశంపై తొలుత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ... ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. కానీ గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజీ నిపుణులు. గాలి ద్వారా కరోనా 4.8 మీటర్ల దూరం వరకు వ్యాప్తిస్తుందని వారు అంటున్నారు. 
 
దీనికి సంబంధించి మెడ్‌రెక్సివ్‌లో పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. దీని ప్రకారం.. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తుందని చెప్పేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వారు బల్లగుద్ది వాదిస్తున్నారు. వైరస్ వ్యాప్తి, క్లస్టర్లను అడ్డుకోవాలంటే ఇప్పుడున్న మార్గదర్శకాలను మార్చాలని వారు సూచించారు.
 
చిన్న చిన్న తుంపర్లలోని కరోనా వైరస్ అణువులు గాల్లో అలాగే ఉంటున్నాయని, దగ్గుతూ, చీదుతూ మాట్లాడే వారి సమీపంలోని గాలిని పీల్చడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని స్పష్టంచేశారు.
 
అయితే గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించింది. వివిధ దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని లేఖలు రాయడంతో తాజాగా అంగీకరించింది.