అందుకే నా మరదలిని చేసుకోవాలంటే భయమేస్తోంది...
నాకు ఉహ తెలిసినప్పటి నుండి నా మరదలు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అని అడిగితే అది నేను మాటల్లో చెప్పలేను. అలాగే నా మరదలకి కూడా నేనంటే చాలా ఇష్టం. ఇద్దరి ఫ్యామిలీలో కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. నెక్స్ట్ ఇయర్‌లో మాకు మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. కాని నా మరదలు నాకు మూడోతరం నుండి వస్తున్న భార్య అవుతుంది. అంటే మా నాన్న అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నుండి వచ్చినది, తరువాత మా అమ్మ కూడా వాళ్ళ ఫ్యామిలీ నుండి నాన్నకిచ్చి మ్యారేజ్ చేసారు, ఇప్పుడు నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ నుండి అమ్మాయిని(మరదలు)ని చేసుకుంటున్నాను.
కాని వాళ్ళకి పుట్టిన పిల్లలందరూ బాగున్నారు. ఆరోగ్యంగా కూడా ఉన్నారు. ఇప్పుడు మా ఇద్దరికీ ఒక భయం వెంటాడుతుంది. నా మరదలు కొంచం సన్నగా ఉంటుంది. మా ఇద్దరికి 4 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. అందులో మూడోతరం ఇద్దరి ఫ్యామిలీలో కూడా భయపడుతున్నారు. కానీ మేము ఇద్దరం ఇష్టపడుతున్నాము అని వాళ్ళు ఏమి అనలేకపోతున్నారు. మాకు పుట్టబోయే పిల్లలకు ఏమైనా జరుగుతుందా...? చాలా భయంగా ఉంది. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. ఈ సమస్య ఇద్దరినీ చాలా బాధగా ఉంచుతోంది...
మీకు పుట్టబోయే పిల్లలకు ఏమైనా జరుగుతుందా...? అంటే అది ఆరోగ్యపరమైనదా... లేక మరేదైనా అని మీరు ఆలోచిస్తున్నారా...? అనేది స్పష్టంగా లేదు. సహజంగా మేనరికం వివాహాలలో పుట్టే పిల్లలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటారు. జన్యు సంబంధమైన వ్యాధులతో పిల్లలు పుడతారనీ, అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కొన్ని సందర్భాల్లో నిరూపితమైంది. ఐతే ఇవి కొంతమంది జంటలకు పుట్టే బిడ్డల్లో కనిపించకపోవచ్చు. అయినప్పటికీ పెళ్లి చేసుకున్నట్లయితే స్త్రీ గర్భం దాల్చిన దగ్గర్నుంచి ప్రత్యేకంగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలా చేయించుకున్నట్లయితే కొంతమేర ఏమైనా అవలక్షణాలున్నట్లయితే బయటపడుతాయి.