శార్వరీ నామ ఉగాది సంవత్సరం... బోసిబోయిన ఆలయాలు
తెలుగు సంవత్సరాదుల్లో ఒకటైన శ్రీ శార్వరీ నామ సంవత్సరం బుధవారం నుంచి మొదలైంది. ఈ ఉగాది పర్వదినం రోజున కరోనా వైరస్ భయం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు పూర్తిగా బోసిబోయి కనిపిస్తున్నాయి.
సాధారణంగా పండగంటేనే దేవాలయాలు భక్తులతో కిక్కిరుస్తాయి. అందులోనూ ఉగాది అంటే, తెల్లవారుజామునే తెరచుకునే మార్కెట్లు, కొత్త మామిడి కాయలు, బెల్లం, వేపపువ్వు, కొత్త చింతపండు... వాటి కొనుగోలు నిమిత్తం వచ్చే ప్రజలతో కళకళలాడే ప్రాంతాల్లో ఇపుడు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు.
దీనికి కారణం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. అంతకుముందునుంచే అన్ని ఆలయాలను మూసివేశారు. భక్తుల దర్శనం రద్దు చేశారు. కేవలం రోజువారి పూజలనే వేదపండితులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది రోజున కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు తెరిచివుంచినప్పటికీ... ప్రజలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
మరోవైపు, ఉగాది పండగను పురస్కరించుకుని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
కుటుంబం, సమాజం బాగున్నపుడే నిజమైన ఉగాది అని అన్నారు. ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఈసారి మాత్రం వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో బుధవారం ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే, ప్రజలకు, భక్తులకు అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని, సహకరించాలని కోరారు.
ఇదిలావుండగా, ఉపాది పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌లు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ యేడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో కళకళలాడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
షడ్రుచుల ఉగాది ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలిగించాలని అభిలషిస్తున్నట్టు వెల్లడించారు. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనాను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కొన్నాళ్ల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.