ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By chitra
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2016 (16:52 IST)

ఉగాది పచ్చడి తయారీ విధానం...!

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం. 
 
బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. "ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. అలాంటి ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!
 
ఉగాది పచ్చడికి కావల్సిన పదార్థాలు:
వేపపువ్వు- తగినంత 
చిన్న చెరుకు ముక్క - 1 
చిన్న కొబ్బరి ముక్క -1
అరటిపళ్లు- 2
చింతపండు - తగినంత
చిన్న మామిడికాయ- 1
బెల్లం- 100 గ్రాములు
పచ్చి మిరపకాయ - 1
ఉప్పు- తగినంత
నీళ్లు - సరిపడా
 
తయారీ విధానం: ముందుగా చెరుకు, కొబ్బరి, బెల్లం, మిర్చి, మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని పెట్టుకోవాలి. వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకుల్నితీసి పెట్టుకోవాలి. తగినన్నినీళ్లలో చింతపండును బాగా కలిపి వడకట్టిన పులుపు నీళ్లను చిన్న కొత్త కుండలోకి పోయాలి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, చెరకు, కొబ్బరి, మిర్చి, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా అరటిపండు ముక్కలు వేయాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ.