శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By సందీప్
Last Updated : శనివారం, 6 ఏప్రియల్ 2019 (10:21 IST)

ఎండాకాలం.. మొక్కల సంగతి ఏంటి?

ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సమస్త జీవరాశులు వేడిమికి తాళలేకపోతున్నాయి. మొక్కల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో నీరు అందకపోతే వాడి నశించిపోతాయి. మిద్దెపై తోటలు పెంచేవారు మొక్కలు కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెరటిలో పెంచే మొక్కలకైతే ఎండ భూ ఉపరితలం మీద మాత్రమే పడుతుంది. 
 
కానీ మిద్దె కాంక్రీటుతో నిర్మించబడి ఉంటుంది. కుండీల్లో మొక్కలు నాటాల్సి వస్తుంది. అందువల్ల కుండీల చుట్టూ కూడా ఎండ పడుతుంది. కాబట్టి మొక్కలు వాడిపోతాయి. ఎంత తీవ్రత నుండి వాటిని రక్షించాలి. షేడ్ నెట్ కట్టాలంటే దానికి బలమైన సపోర్ట్ కావాలి. లేకపోతే పెద్ద గాలి వస్తే కొట్టుకుపోతుంది. దీని నిర్మించాలంటే శ్రమ, ఖర్చు ఉంటుంది. కాబట్టి నీటి సరఫరా విషయంలో శ్రద్ధ తీసుకుంటే మొక్కలను కాపాడుకోవచ్చు. మొక్కలకు ఉదయం, సాయంత్రం నీరు పెట్టాలి. మధ్యాహ్నం పెట్టకూడదు. 
 
సాయంత్రం మిద్దె పైకి వెళ్లి మొక్కలను పరిశీలించాలి. ఆకులు వాలినట్లు తేమ శాతం తగ్గినట్లు కనిపిస్తే చర్యలు తీసుకోవాలి. మొక్కలకు వేర్లు పైపైనే ఉంటాయి. వాటికి వేరు స్థాయికి మించి క్రిందకు నీరు పెట్టాల్సిన అవసరం లేదు. తోటలో రాలిన ఆకులను మొక్కల మొదళ్లలో కప్పాలి. అప్పుడు పెట్టిన నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. ఆకులు కుళ్లి ఎరువుగా మారుతాయి. 
 
షేడ్ నెట్‌లు అవసరం లేకుండా ఉండాలంటే మిద్దె తోటలో పండ్ల చెట్లు పెంచాలి. ఇవి పెరిగి నీడ పడేలా చేస్తాయి. హైబ్రిడ్ చెట్లు నాటితే మరీ మంచిది. ఇవి ఎక్కువ ఎత్తు పెరగవు, పండ్లు త్వరగా కాస్తాయి. గాలికి పడిపోకుండా ఉంటాయి. తోటలోని మొక్కల నుండి మంచి దిగుబడి సాధించవచ్చు.