ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (16:20 IST)

ఆఫ్గాన్ వీడేందుకు సిద్ధంగా ఉన్న వేలాది మంది జర్నలిస్టులు

ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు. దీంతో ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొనివున్నాయి. ముఖ్యంగా, ఆప్ఘన్ పౌరులే తండోపతండాలుగా దేశం వీడి వలస వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ఘన్‌లో జర్నలిస్టులు దేశం వదిలి వెళ్ళిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
 
ఇందుకోసం అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్​ సహకరించాలని వారు అభ్యర్థిస్తున్నారు. సుమారుగా రెండు వేల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. 
 
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భయంతో వేల మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి జర్నలిస్టులు కూడా అఫ్గాన్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. 
 
ఇలా దాదాపు రెండు వేల మంది అఫ్గాన్‌ జర్నలిస్టులు దేశం విడిచి వెళ్తామంటూ అంతర్జాతీయ జర్నలిస్టుల ఫెడరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో వారిని కాబుల్‌ ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా చేరుకునేలా రక్షణ కల్పించాలని కోరుతూ ఐఎఫ్‌జే తాలిబన్లను సంప్రదించింది. 
 
అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులతో యావత్‌ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు తమ పౌరులను తరలించే ప్రక్రియను ముగించగా.. మరికొన్ని దేశాలు ఆగస్టు 31నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.