శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (14:05 IST)

ఇండియన్ టెక్కీలకు ఆస్ట్రేలియా షాక్... 457 వీసా విధానం రద్దు.. ట్రంప్ ఆదర్శమా...?

ఆస్ట్రేలియా సర్కారు కూడా అమెరికా బాటలో పయనించనుంది. తమ ఉద్యోగాలు.. తమ పౌరులకే అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకునే వీసా (457 వీసా విధానం)నే రద్

ఆస్ట్రేలియా సర్కారు కూడా అమెరికా బాటలో పయనించనుంది. తమ ఉద్యోగాలు.. తమ పౌరులకే అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో ఇప్పటివరకు అమల్లో ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకునే వీసా (457 వీసా విధానం)నే రద్దు చేసింది. ఇది భారతీయ టెక్కీలకు శరాఘాతంగా మారనుంది. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు 457 వీసాను ఉపయోగిస్తుంటారు. ఆయా కంపెనీలు ఈ వీసా ఉన్న విదేశీయులనే నియమించుకుంటుంటాయి. ఆస్ట్రేలియాలో కంపెనీలకు కావాల్సిన నిపుణులు లేకపోతే.. విదేశీయులను తీసుకునేందుకు 457 వీసాను కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. అయితే ఈ వీసా ద్వారా పలు అక్రమాలు జరగడమే కాకుండా స్థానికులకు ఉద్యోగావకాశాలు దెబ్బతింటున్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది.
 
ముఖ్యంగా... ఈ తరహా వీసాపై వచ్చిన వాళ్లు వరుసగా నాలుగేళ్లపాటు ఆస్ట్రేలియాలోనే వివిధ కంపెనీల్లో ఉద్యోగం చేసుకోవచ్చు. ఇప్పటికే 457 వీసాపై వచ్చిన విదేశీయుల సంఖ్య 95 వేలకు చేరిందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కోల్మ్ టర్న్‌బిల్ వివరించారు. దీనివల్ల తమ దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని అంటున్నారు. అందుకే 457 వీసా విధానం రద్దు చేసినట్టు తెలిపారు. 
 
అయితే, తమది వలసదారుల దేశమనీ, అయితే ఈ 457 వీసాను రద్దు చేసినంత మాత్రాన వలసదారులపై కక్ష కట్టినట్లు కాదన్నారు. అవకతవకలకు తావులేని మరో నూతన వీసా సర్వీసును అందుబాటులోకి తెస్తామనీ, ఆస్ట్రేలియాకు నిపుణులైన విదేశీయుల అవసరం ఎంతో ఉందని తెలిపారు. కాగా ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయుల్లో భారతీయులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
 
కాగా, అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్.. అమెరికన్లకే ఉద్యోగాలు.. వంటి నినాదాలను తెరపైకి తెచ్చారు. అమెరికన్లకు ఉద్యోగాలు పేరిట హెచ్-1బీ వీసాల్లో పలు విప్లవాత్మక మార్పులు చేశారు. కానీ, ఆస్ట్రేలియా మాత్రం ఏకంగా విదేశీ ఉద్యోగులను నియమించుకునే వీసానే రద్దు చేయడం గమనార్హం.