శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: బుధవారం, 3 జూన్ 2020 (18:12 IST)

రష్యాలో కొత్త పురుగు, రక్తం తాగుతోందట

పేల లాంటి పురుగులతో రష్యా కొత్త సమస్య ఎదుర్కొంటోంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా కకలావికలం అవుతుంటే, మరో ముప్పు ఆ దేశాన్ని పీడించడానికి తయారైంది. ఈ పురుగులు రక్తాన్ని పీలుస్తూ వేలాది మందిని ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. కోవిడ్ రోగులతో హాస్పిటళ్లు నిండిపోతుంటే, ఈ సమస్య మరో తలనొప్పిగా మారింది.
 
మరో విషయం గమనించాల్సిందేమంటే వీటి వలన వచ్చే రోగాలకు మునుపు నుండి ఇస్తున్న వ్యాక్సిన్‌లు ఇప్పుడు పనిచేయడం లేదట. వైరస్ జన్యు నిర్మాణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఇప్పటికే ఉండే వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా పనిచేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ దాడి రష్యాలో కొత్త కాకపోయినప్పటికీ ప్రస్తుతం గుంపులు గుంపులు వచ్చి ప్రజల మీద దాడి చేస్తున్నాయి.
 
జన్యు మార్పుల వల్ల కొత్త రోగాలను కూడా ఇవి సృష్టించడం మొదలుపెట్టాయి. చిన్నారులపై వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పేల లాగే ఉన్నా ఆకారంలో కొద్దిగా పెద్దవిగా ఉన్నాయి. సాధారణంగా ఇవి జంతువులలో ఎక్కువగా కనిపిస్తాయి.
 
గడ్డి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ఆలాంటి ప్రాంతాల్లో సంచరించే వారికి ముప్పు తప్పడం లేదు. మునుపటి కంటే వీటి ఉత్పత్తి 428 రెట్లు పెరిగిందని అధికారులు వెల్లడించారు. వీటి దాడిని తేలికగా తీసుకోవద్దని, బ్రెయిన్, కీళ్లు, గుండె దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.