1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (12:24 IST)

జపాన్‌ టూర్.. చైనాపై ఫైర్ అయిన నరేంద్ర మోడీ!

జపాన్‌ టూర్‌లో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాపై విరుచుకుపడ్డారు. సోమవారం టోక్యోలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో జరిగిన భేటీలో, 21వ శతాబ్దంలో వికాస (అభివృద్ధి)వాదానికి తప్ప, విస్తరణ వాదానికి చోటు లేదన్నారు. 
 
వికాసవాదం కావాలో, విస్తరణవాదం కావాలో మనమే నిర్ణయించుకోవాలని మోడీ అన్నారు. విస్తరణవాదాన్ని అనుసరిస్తే ప్రపంచం ముక్కచెక్కలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బుద్ధుడి మార్గంలో నడుస్తూ వికాసంపై నమ్మకం ఉన్న దేశాలే అభివృద్ధి పథంలో దూసుకు పోతాయని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అయితే ఇప్పటికీ కొన్ని దేశాలు (చైనాను ఉద్దేశించి) ఇతర దేశాలు భూభాగాలు, సముద్రప్రాంతాలు తమవేనంటూ చొరబడుతున్నాయని మోడీ విమర్శించారు. భూ, సముద్ర సరిహద్దుల విషయంలో జపాన్‌, భారత్‌, వియత్నాం, మలేషియా వంటి దేశాలతో చైనా అనుసరిస్తున్న నియంతపోకడల్ని దృష్టిలో పెట్టుకుని మోడీ ఈ పరోక్ష విమర్శలు చేశారు.
 
18వ శతాబ్దంలో రాజులు విపరీతమైన రాజ్యకాంక్షతో పరాయి దేశాలను ఆక్రమించుకునేవారిని... అలాంటి విపరీత కాంక్ష ప్రస్తుతం మన చుట్టుప్రక్కల ఉన్న ఓ దేశంలో కనపడుతోందని మోడీ వ్యాఖ్యానించారు. విస్తరణ వాదం ఎప్పటికీ ప్రజలకు మేలు చేకూర్చలేదని ఆయన అభిప్రాయపడ్డారు.