గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 ఫిబ్రవరి 2019 (11:35 IST)

చైనా వక్రబుద్ధి.. పుల్వామా దాడిని ఖండిస్తూ ప్రకటన చేయమంటే?

చైనా వక్రబుద్ధి ఐక్యరాజ్య సమితి వేదికగా బయటపడింది. భారత్‌కు మద్దతిస్తున్నాం.. అంటూనే డ్రాగన్ కంట్రీ తన బుద్ధేంటో నిరూపించుకుంది. తనకున్న ఆర్థికబలంతో పాకిస్థాన్‌ను మచ్చిక చేసుకున్న చైనా.. భారత్‌ను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పుల్వామా ఘటనను ఖండిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చినప్పుడు కూడా తనకున్న అధికారంతో ఆ ప్రకటనను చైనా వాయిదా వేయించగలిగింది. 
 
15 శాశ్వత, తాత్కాలిక సభ్యుదేశాలతో కూడిన భద్రతామండలి... పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రదాడిని తీవ్ర పదజాలంతో ఖండిస్తూ ఫిబ్రవరి 14న ప్రకటన చేయాలని సంకల్పించింది. కానీ, చైనా దీనికి మోకాలడ్డింది. దీనిపై స్పందించేందుకు సమయం కావాలంటూ పదే పదే అడిగింది. దాంతో చైనా ఫిబ్రవరి 18 వరకు గడువు పొడిగించాలని కోరినా, మిగతా 14 సభ్యదేశాలు ఫిబ్రవరి 15వ తేదీనే ప్రకటన చేసేందుకు సిద్ధపడ్డాయి. 
 
కానీ చైనా, పాకిస్థాన్‌ను ఈ ప్రకటనను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డినా మిగిలిన దేశాలు ఎట్టకేలకు ఫిబ్రవరి 21న భద్రతామండలి పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేసింది. తద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ సాధించిన విజయంగా దీన్ని అభివర్ణించవచ్చు. జమ్మూకాశ్మీర్‌లో ఎంతో కాలంగా భద్రతాబలగాలపై జరుగుతున్న దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఖండించడం చరిత్రలో ఇదే తొలిసారి. 
 
ఈ ప్రకటన వెలువడేందుకు అగ్రరాజ్యం అమెరికా ఎంతో కృషి చేసినట్టు భారత దౌత్యవర్గాలు వెల్లడించాయి. పుల్వామా దాడిని ఖండిస్తూ భద్రతామండలి చేసిన విస్పష్ట ప్రకటన పాకిస్థాన్, దానికి కొమ్ముకాస్తున్న చైనాకు చెంపపెట్టులాంటిదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.