1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (09:27 IST)

బ్రిటన్‌లో విజృంభిస్తున్న కరోనా స్ట్రెయిన్.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్!

బ్రిటన్‌లో పురుడుపోసుకున్న కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో మరోమారు పూర్తి స్థాయి లాక్డౌన్‌ను విధిస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దీంతో దాదాపు 5.6 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫిబ్రవరి రెండో వారం వరకూ ఈ సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు.
 
లాక్డౌన్‌లో భాగంగా స్కూళ్లు మొత్తం మూతబడతాయని, లాక్డౌన్ బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జాన్సన్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సంపూర్ణ లాక్డౌన్ పెడుతున్నట్టు స్కాట్ లాండ్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే బోరిస్ జాన్సన్, తన ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.
 
ఇకపోతే, ఇంగ్లండ్‌ ప్రజల్లో దాదాపు మూడొంతుల మంది ఇప్పటికే పలు కఠిన ఆంక్షల మధ్య, తమ దైనందిన కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే కరోనా సోకిన కారణంగా సంభవించిన మరణాల విషయంలో బ్రిటన్ గణాంకాలు భీతి గొలిపేలా ఉన్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైంది. అదేసమయంలో మ్యూటేషన్ చెందిన వైరస్ వెలుగులోకి రావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. 
 
ఫలితంగా సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 27 వేల మంది కొవిడ్ చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో ఉన్నారు. గత సంవత్సరం ఏప్రిల్‌లో వచ్చిన ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే, ఈ సంఖ్య 40 శాతం అధికం. ఇంగ్లండ్ జాతీయ స్థాయి లాక్డౌన్‌లోకి మరోసారి వెళ్లక తప్పనిసరి పరిస్థితి నెలకొని వుందని, ప్రజలు సహకరించాలని జాన్సన్ కోరారు.