శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (12:33 IST)

తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాప్తి చెందడాన్ని అడ్డుకున్న క్యూబా వైద్యులు... సాధ్యమా...?

ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు జరుపుతున్న పోరాటంలో క్యూబా దేశ వైద్యులు మరో అడుగు ముందుకు వేశారు. ఆ దేశంలో తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నారు. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాధి సంక్రమించకుండా చేయడం ద్వారా ఆ దేశ వైద్యులు రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మార్గరేట్ చాన్ వెల్లడించారు.
 
హెచ్‌ఐవీ సోకిన మహిళ ప్రసవించినట్టయితే పుట్టిన బిడ్డకు కూడా తల్లి నుంచి బిడ్డకు ఆ వ్యాధి సోకుతుందన్నారు. అయితే తల్లికి హెచ్‌ఐవీ ఉన్నప్పుడు ప్రసవం ముందర కొద్దికాలం పాటు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ ఇవ్వాలని, ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డకు కూడా తగిన మోతాదులో మందులు వాడాల్సి ఉంటుందని మార్గరేట్ వివరించారు. ఈ విధానం ద్వారా వాడే మందుల్లో నెవిరపిన్, జిడోవుడిన్ అనే ఔషధాలు బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా బాగా ఉపకరిస్తాయని తెలిపారు. 
 
ఈ పద్ధతి ద్వారా తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ వ్యాపించకుండా అడ్డుకోగలిగామని వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షల మంది హెచ్‌ఐవీ బాధిత మహిళలు గర్భం దాల్చుతుండగా వారిలో 15 నుంచి 45 శాతం మందికి పుట్టే బిడ్డలు కూడా హెచ్ఐవీ వైరస్‌తోనే పురుడుపోసుకుంటున్నారు. అయితే వైద్యశాస్త్రంలో నూతన పరిశోధనల ఫలితంగా గత ఏడేళ్లుగా తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ వ్యాప్తి చెందడం తగ్గుతూ వస్తోంది.