శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (11:39 IST)

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు... తృటిలో తప్పిన ముప్పు!! (Video)

donald turmp
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఓ దండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దుండుగుడు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ఆయన చెవి భాగంలో దూసుకెళ్లింది. దీంతో చెవి వద్ద గాయమైంది. ఆ వెంటనే ఆయన తన ఎన్నికల ర్యాలీని ముంగిచారు. అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా ఈ ఘటన చేసింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రంప్‌నకు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావమయింది. బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించిన వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో కిందకు వంగారు. 
 
తక్షణమే అప్రతమత్తమైన భద్రతా సిబ్బంది మాజీ అధ్యక్షుడికి రక్షణ కవచాన్ని ఏర్పాటుచేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిలో నిందితుడు కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అనూహ్య రీతిలో జరిగిన కాల్పుల ఘటనతో ఎన్నికల ర్యాలీలో ఒక్కసారిగా అరుపులు, కేకలతో గందరగోళం నెలకొంది. బుల్లెట్ గాయాల పాలైన ట్రంప్‌ చెవి, ముఖంపై రక్తం కనిపించాయి. ఒక చేతితో చెవిని పట్టుకున్నారు. కాగా ట్రంప్‌ను హాస్పిటల్‌కు తరలిస్తున్న సమయంలో ఆయన పిడికిలి బిగించి ఎన్నికల ర్యాలీలోని ప్రజలకు చూపించారు. కాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారంటూ సీక్రెట్ సర్వీస్ ‘ఎక్స్‌’ వేదికగా నిర్ధారించింది. ఆయన బాగానే ఉన్నారని, వైద్యులు ఆయనను పరిశీలిస్తున్నారని తెలియజేశారు.
 
కాగా, ఈ దాడి ముందస్తు ప్లానింగ్‌ ప్రకారమే దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులు సూచిస్తున్నాయి. ముష్కరుడు దాడి చేయడానికి నక్కిన ఇంటిపైకి ఎక్కేందుకు నిచ్చెన ఉంది. ట్రంప్‌ వచ్చే సమయానికే అతడు పైకప్పు ఎక్కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సభాస్థలి.. గన్‌మెన్‌ పొజిషన్‌ తీసుకొన్న ప్రదేశం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడికి పాల్పడిన నిందితుడి వయసు సుమారు 20 ఏళ్లని, స్థానికుడిగానే గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు నిందితుడి పేరును మాత్రం వెల్లడించలేదు. నిందితుడు ఏఆర్‌ శ్రేణి సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఆయుధాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. 
 
మరోవైపు ఎత్తైన పొజిషన్‌లో సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది స్నిప్పర్‌ స్పందించి అతడిపై ఎదురుదాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మరోవైపు గాయపడి కిందకు వంగిన ట్రంప్‌ పైకి లేవగానే.. 'నేను ఎప్పటికీ లొంగిపోను' అని పిడికిలి బిగించి నినాదం చేశారు. ట్రంప్‌పై కాల్పుల ఘటనను హత్యాయత్నంగానే దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. ట్రంప్‌పై దాడి జరగవచ్చనే అనుమానంతోనే ఆయన సీక్రెట్‌ సర్వీస్‌ భద్రతను కొన్నాళ్ల క్రితమే మరింత కట్టుదిట్టం చేశారు.