శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (10:36 IST)

బుల్లెట్ కుడిచెవి భాగంలో దూసుకెళ్లింది.. డోనాల్డ్ ట్రంప్ (Video)

donald trump
పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో దుండగుడు తనను లక్ష్యంగా చేసుకుని జరిపిన తుపాకీ కాల్పుల్లో బుల్లెట్ తన కుడి చెవి పైభాగంలో నుంచి వెళ్లిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ట్రూత్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆయన స్పందించారు. సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది తన ప్రాణాల్ని కాపాడారన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు.
 
'పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన కాల్పులపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సహా మిగతా సిబ్బందికి ధన్యవాదాలు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదు. 
 
కాల్పుల జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియదు. నా కుడి చెవి పైభాగంలో నుంచి బుల్లెట్‌ వెళ్లింది. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైంది. అంతలోనే బుల్లెట్ నా చెవి పైనుంచి దూసుకెళ్లినట్లు అనిపించింది. చాలా రక్తస్రావం జరిగింది. ఏం జరుగుతుందో గ్రహించాను. గాడ్ బ్లెస్ అమెరికా!' అని ట్రంప్‌ పోస్ట్‌ చేశారు.
 
మరోవైపు, పెన్సిల్వేనియాలోని బట్లర్‌ ప్రాంతంలో రిపబ్లికన్‌ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నే లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. బుల్లెట్‌ ట్రంప్‌ చెవి పైనుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటనను ఆయనపై జరిగిన హత్యాయత్నంగానే అమెరికా మీడియా పేర్కొంటోంది. 
 
సీక్రెట్‌ సర్వీస్‌ అధికార ప్రతినిధి వివరాల ప్రకారం.. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:15 గంటలకు జరిగింది. ఈ ర్యాలీకి వేలాది మంది తరలివచ్చారు. అమెరికా మీడియా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తూ ఉంది. దీంతో కాల్పుల దృశ్యాలు, తర్వాత జరిగిన పరిణామాలన్నీ వీడియోల్లో రికార్డయ్యాయి. బుల్లెట్‌ ట్రంప్‌ చెవి పైనుంచి దూసుకెళ్లడం, ఆయనకు రక్తస్రావం కావడం సహా అన్ని దృశ్యాలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి. కాల్పుల శబ్దం విని వెంటనే అప్రమత్తమైన ట్రంప్‌ పోడియం కింద చేరి తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ఆయనకు రక్షణగా చేరి బయటకు తీసుకెళ్లారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కారులో ఎక్కించుకొని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.