శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (18:48 IST)

తుపాకీతో సెల్ఫీకి ఫోజిచ్చాడు.. అనంతలోకాలకు చేరుకున్నాడు... ఎలా?

ఇటీవలికాలంలో సెల్ఫీల మోజు పెరిగిపోతోంది. ఏ ఒక్క కొత్త ప్రాంతానికెళ్లినా.. ఏ కొత్త పని చేసినా సెల్ఫీలు తీసి వాటిని ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఎక్కువమందిని ఆకట్టుకునేందుకు ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారు. అయితే, ఇలాంటి సెల్ఫీలు కొన్ని సందర్భాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. 
 
తాజాగా, అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో డెలియోన్ అలోన్స్ స్మిత్ (19) అనే యువకుడు తుపాకీతో సెల్ఫీకి ఫోజిచ్చాడు. ఆసమయంలో తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంత అక్కడే మృత్యువాతపడ్డాడు. డెలియోన్ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో అతని బంధువు అదే ఇంట్లో పక్కరూంలో ఉన్నాడు. బుల్లెట్ నేరుగా గొంతులో దిగడంతో అతనిని రక్షించే అవకాశం కూడా లేకపోయిందని డెలియోన్ బంధువు వాపోయాడు. 
 
ఈతరహా సంఘటనలు చోటుచేసుకోవడం ఇది తొలిసారి కాదని హ్యూస్టన్ పోలీసు విభాగం అధికారులు చెపుతున్నారు. గత మే నెలలో ఇదే విధంగా తుపాకీతో సెల్ఫీలు తీస్తుండగా ప్రమాదవశాత్తు పేలి ఓ వ్యక్తి మరణించాడని చెపుతున్నారు. అలాగే, సింగపూర్‌కు చెందిన ఓ పర్యాటకుడు కూడా ఇలాగే చనిపోయినట్టు ఉదహరిస్తున్నారు.