1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 ఏప్రియల్ 2021 (23:01 IST)

భారత్ కరోనాతో అతలాకుతలం: సాయం చేసేందుకు సిద్ధమన్న చైనా

కరోనావైరస్ కారణంగా భారతదేశం అతలాకుతలం అవుతోందనీ, అక్కడ పరిస్థితులు దారుణంగా వున్నాయని, మందుల కొరత తలెత్తుతోందనీ, తాము అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా వున్నామని చైనా ప్రకటించింది.

మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోందనీ, ఈ క్లిష్ట సమయంలో పరస్పర సాయం చేసుకోవడం ఎంతో అవసరమని గురువారం నాడు మీడియాతో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ తెలిపారు.
 
కరోనాను అదుపులోకి తెచ్చేందుకు భారతదేశానికి అవసరమైన అన్నిరకాల సాయం చేసేందుకు చైనా సిద్ధంగా వుందని తెలిపారు. కాగా దేశంలో కరోనా కేసులు రాకెట్ వేగంతో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,14,835 కరోనా కేసులు నమోదవగా 2,104 మంది మృతి చెందారు.

కరోనా వచ్చిన తర్వాత దేశంలో ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు దేశంలో మొత్తం 1.59 కోట్లు కరోనా కేసులు నమోదవగా మరణించినవారి సంఖ్య 1,84,657కి పెరిగింది.