1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (10:46 IST)

కాశ్మీర్‌లో పాక్ జోక్యం సహించం.. అది భారత్‌లో భాగమే.. పాకిస్థాన్ ఓ టెర్రరిస్థాన్: భారత్

భారత్‌పై వినియోగించేందుకు తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను తయారుచేసుకున్నామని పాకిస్థాన్ ప్రధాని షాహిద్‌ అబ్బాసీ వెల్లడించారు. పాకిస్తాన్‌ అణుశక్తి తమ నియంత్రణలోనే భద్రంగానే ఉందన్నారు. ఇలా ప

భారత్‌పై వినియోగించేందుకు తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను తయారుచేసుకున్నామని పాకిస్థాన్ ప్రధాని షాహిద్‌ అబ్బాసీ వెల్లడించారు. పాకిస్తాన్‌ అణుశక్తి తమ నియంత్రణలోనే భద్రంగానే ఉందన్నారు. ఇలా పాకిస్తాన్ ప్రధాని అబ్బాసీ వ్యాఖ్యలకు భారత్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. భౌగోళిక పరంగా పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రవాదానికి పర్యాయపదంగా మారిందంటూ అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టింది. 
 
శుక్రవారం ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం (యుఎన్‌జీఏ) వేదికగా ఐక్యరాజ్య సమితిలో భారత ఫస్ట్ సెక్రటరీ ఈనాం గంభీర్ మాట్లాడుతూ పాకిస్థాన్‌ అది స్వచ్ఛమైన ఉగ్రవాద నేల అని, అది పాకిస్థాన్ కాదు టెర్రరిస్థాన్ అని ఘాటుగా విమర్శించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ... అంతర్జాతీయంగా దాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్.. ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్ లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.
 
26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయాద్‌‌ పొరుగు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతుండడంపైనా భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పెరిగిపోయారని.. ఎలాంటి శిక్షా లేకుండా వారు ఆ దేశ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత్ ఉద్ఘాటించింది. 
 
సొంత గడ్డపై దారుణంగా విఫలమైన ఓ దేశం నుంచి ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై ప్రపంచానికి పాఠాలు అవసరం లేదని ఈనాం గంభీర్ పాకిస్తాన్‌కు చురకలంటించారు. జమ్మూకాశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్‌ దేశంలో భాగంగానే వుంటుందని పాకిస్థాన్ అర్థం చేసుకుంటే బాగుంటుందని స్పష్టం చేశారు.  
 
యుఎన్‌జీఏలో పాక్ ప్రధాని అబ్బాసీ మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్యను ప్రస్తావించడంతో పాటు, పాకిస్తాన్‌పై భారత్ టెర్రరిజాన్ని పోత్సహిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తీరుపై గంభీర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఐరాస వేదికగా పాకిస్తాన్‌పై భారత్ ఈ స్థాయిలో చురకలంటించడం ఇదే తొలిసారి. పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీకి భారత్ బదులిస్తూ... ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల దాడిని తప్పించుకునేందుకు కాశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ పదేపదే వాడుతుందని భారత్ ఫైర్ అయ్యింది. 
 
లాడెన్, ముల్లా ఒమర్‌ లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన దేశమే తాము బాధితులమని ఏడవడం దారుణమని భారత్ ఎండగట్టింది. పాకిస్థాన్ తీరేంటో దాని పొరుగు దేశాలకన్నింటికీ బాగా తెలుసునని భారత ఫస్ట్ సెక్రటరీ ఈనాం గంభీర్ స్పష్టం చేశారు. కాశ్మీర్‌‌లో పాకిస్థాన్ జోక్యాన్ని సహించేది లేదని మరోసారి అంతర్జాతీయ వేదికగా తేల్చి చెప్పారు.