బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (11:07 IST)

ఇనుప ఊపిరితిత్తుల అమర్చిన రోగి మృతి...

iron lungs
గత కొంతకాలంగా ఇనుప ఊపిరితిత్తులతో జీవిస్తూ వచ్చిన అమెరికాకు ఐరన్ లంగ్ వ్యక్తి 78 యేళ్ల యవసులో ప్రాణాలు కోల్పోయాడు. టెక్సాస్‌కు చెందిన పాల్ అలెగ్జాండర్ 1952లో ఆరేళ్ల వయసున్నప్పుడు పోలియో వ్యాధి బారినపడ్డాడు. అప్పటికి టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. చాలా మందికి అంగవైకల్యం కలిగించే పోలియో వ్యాధి పాల్ విషయంలో మరింత తీవ్రంగా పరిణమించింది. మెడ దిగువ భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఊపిరితిత్తుల కండరాలు కూడా పనిచేయకపోవడంతో శ్వాసతీసుకోవడం కూడా కష్టంగా మారింది. 
 
దీంతో వైద్యులు అతడికి ఐరన్ లంగ్స్ పేరుపడిన జీవనాధార వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెద్ద గొట్టం ఆకారంలో ఉండే ఈ పరికరంలో రోగిని ఉంచుతారు. ఇది పేషెంట్లకు బదులుగా శ్వాసతీసుకుని ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. 1955లో పోలియో టీకా అందుబాటులోకి వచ్చినా పాల్ విషయంలో అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. దీంతో, అతడు ఆ తర్వాత 70 ఏళ్ల పాటు ఐరన్ లంగ్స్‌లోనే జీవించాడు.
 
అయితే, శరీరమంతా చచ్చుబడినా కూడా ఆయన ఆశావహ దృక్పథంతో జీవించాడు. న్యాయశాస్త్రం అభ్యసించి లాయర్ అయిన పాల్.. 'త్రీ మినిట్స్ ఫర్ డాగ్' పేరిట తన ఆత్మకథను కూడా ప్రచురించారు. కాగా, పాల్ మార్చి 12న కన్నుమూసినట్టు వికలాంగుల హక్కుల కార్యకర్త క్రిస్టోఫర్ అల్మర్ గోఫండ్ మీ వెబ్‌సెట్లో (ఆన్‌లైన్ విరాళాల సేకరణ వేదిక) ప్రకటించారు. పాల్‌ను క్రిస్టోఫర్ 2022లో ఇంటర్వ్యూ చేశారు. 'పాల్ జీవితం ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేసింది. అతడు ఎందరికో రోల్ మోడల్. అతడు ఎప్పటికీ మన మనసుల్లోనే ఉంటాడు' అని క్రిస్టోఫర్ రాసుకొచ్చాడు.
 
వైరస్ కారణంగా వ్యాపించే పోలియో ఐదేళ్ల లోపు చిన్నారులను టార్గెట్ చేస్తుందన్న విషయం తెలిసిందే. మానవ విసర్జితాల కాలుష్యం ద్వారా ఇది వ్యాపిస్తుంది. దీని బారిన పడ్డ ప్రతి 2 వేల మందిలో ఒకరికి శరీరం చచ్చుబడుతుంది. 5-10 శాతం కేసుల్లో మాత్రం ఊపిరితిత్తుల కండరాలు కూడా చచ్చుబడటంతో రోగులు శ్వాస అందక మరణిస్తారు. ఇలాంటి వారి కోసమే అప్పట్లో ఐరన్ లంగ్స్ పరికరాన్ని రూపొందించారు. భారీ గొట్టం ఆకారంలో ఉండే ఈ యంత్రంలో రోగిని ఉంచి కృత్రిమ శ్వాస అందించేవారు. 1928లో తొలిసారిగా ఈ యంత్రాన్ని వినియోగించారు. ఇక టీకా అందుబాటులోకి వచ్చాక అనేక దేశాల్లో పోలియో వ్యాధి తుడిచిపెట్టుకుపోయింది.