శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (15:12 IST)

'ఆ' ఆనందాన్ని పూర్తిగా అనుభవించాకే యుద్ధంలోకి దించుతాం : ఐఎస్ కొత్త గాలం

తమకు కావాల్సిన యువతను ఆకర్షించేందుకు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఎన్నో ఆకర్షణీయమైన హామీలను గుప్పిస్తోంది. కొత్తగా చేరే యువకులకు అందమైన అమ్మాయిలతో వివాహం జరిపిస్తామని, ఆ తర్వాత వారు ఆ సుఖాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాతే యుద్ధంలోకి దించుతామని చెపుతోంది. అంతేనా మంచి ఉద్యోగంతో పాటు అన్ని రకాల లగ్జరీ లైఫ్‌ను దగ్గరకు చేరుస్తామని చెపుతోంది. ఈ విషయాలు గత నెలలో చెన్నై నుంచి టర్కీకి బయలుదేరిన ఇద్దరు ముస్లిం యువకులను విమానాశ్రయంలో అరెస్టు చేసి విచారించగా వెలుగు చూశాయి. 
 
పోలీసు వర్గాల కథనం ప్రకారం, సిరియాకు వచ్చి ఐఎస్ ఫైటర్లుగా మారితే వారిని యోధులుగా గుర్తిస్తామని చెప్పింది. గత సంవత్సరం సెప్టెంబరులో నలుగురు భారత యువత, యూఏఈ మీదుగా సిరియాకు వెళ్లగా, వారంతా మంచి జీవితాన్ని, ఉత్తమ ఉద్యోగాలను పొందారని చెబుతూ, వారి వీడియోలు చూపించినట్టు తెలిపారు. రక్కాలో సకల సౌఖ్యాలనూ అనుభవించవచ్చని నమ్మబలికింది. విదేశాల నుంచి వచ్చే యువతకు తొలుత 'జీహాదీ యువతి'తో వివాహం జరిపిస్తామని, ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించిన తరువాతనే యుద్ధంలోకి దిగాలని ప్రలోభ పెట్టిందట. 
 
ఇలాంటి ఆకర్షణీయమైన హామీలను గుప్పించడానికి కారణం లేకపోలేదు. ఖొరాసన్ (ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లోని కొంత భాగం)లో వాడుతున్న నల్ల జండాలను ఏలియా (రోమ్)లో ఎగరేయాలన్నదే ఐఎస్ లక్ష్యంగా ఉంది. ఇందుకు సహకరించేందుకు వచ్చే ఫైటర్లకు అన్ని రకాల ఆఫర్లను గుప్పిస్తోంది.