శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (16:43 IST)

పాత విధానంలో హెచ్1బి వీసాల జారీ : బైడెన్ సర్కారు నిర్ణయం

ఈ యేడాది ఆఖరు వరకు పాత విధానంలోనే హెచ్1బి వీసాలను జారీ చేయాలన అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఎంతో మంది టెక్కీలకు ఉపశమనం కలిగించనుంది. 

అమెరికాలో పనిచేసేందుకు వీలుగా భారతీయులు సహా ఇతర దేశాల ఉద్యోగ నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో డోనాల్డ్ ట్రంప్ నూతన నిబంధనలను తీసుకొచ్చారు. వీటిని బైడెన్‌ ప్రభుత్వం కొంతకాలం వాయిదా వేసింది. 

అదేసమయంలో ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పాత పద్ధతి అయిన లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. కొత్త ఎంపిక ప్రక్రియకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మార్పులు చేయడం కోసం ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీకి మరింత గడువు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

హెచ్‌-1బీ వీసాల జారీలో సంప్రదాయ కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ గత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీసాల ఎంపిక విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గరిష్ట వేతన స్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు ఇచ్చేలా కీలక సవరణ చేశారు. 

హెచ్‌-1బీ ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ జనవరి 7న తుది ప్రకటన కూడా చేసింది. మార్చి 9 నుంచి కొత్త ఎంపిక విధానం అమల్లోకి రావాల్సి ఉంది. 

అయితే కొత్త విధానానికి అనుగుణంగా హెచ్‌-1బీ నమోదు వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాల్సి ఉన్నందున నూతన విధానాన్ని డిసెంబరు 31 వరకు వాయిదా వేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటివరకు పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.