శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (10:36 IST)

నాకిప్పుడింక ఏమీ వద్దు: సిరియా నుంచి గ్రీస్‌కు.. స్మగ్లర్లకు వేడుకోలు

సిరియాలో ఉండలేక టర్కీ చేరుకుని, అక్కడి నుంచి సముద్రం మీదుగా గ్రీసుకు చేరుకుని ఆశ్రయం పొందాలనుకున్నాడు. అందుకోసం స్మగ్లర్లను కూడా సంప్రదించాడు. వారు అబ్దుల్లా  ఓ మోటారు బోటును ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా ప్రయాణ సమయానికి 15 అడుగుల రబ్బరు పడవను మాత్రమే ఇచ్చారు. అయితే ఆ బోటే తన కుటుంబం కొంప ముంచిందని కుర్దీ మీడియాతో చెప్పాడు. తన కుటుంబీకులు అలల తాకిడికి బలైపోయారని వాపోయాడు. 
 
సముద్ర తీరంలో పడివున్న కుర్దీ తనయుడి మృతదేహం చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా మానవతావాదులను కదిలించిన సంగతి తెలిసిందే. కెనడాకు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలని కోటి ఆశలతో అబ్దుల్లా సహా మరో రెండు కుటుంబాలు ఆ చిన్న పడవ ఎక్కి ప్రయాణం ఆరంభించాయి. మార్గమధ్యంలో అలల తాకిడికి బోటు తిరగబడింది. అబ్దుల్లా ఇద్దరు కుమారులు అయిలాన్, గాలిబ్‌లు నీటిలో పడిపోయారు. వారిని రక్షించాలన్న ఉద్దేశంతో ఇద్దరినీ పట్టుకుని ఈదలేక, భార్య రెహాన్ వైపునకు అయిలాన్‌ను తోశాడు.
 
"వాడి తల గాల్లో ఉంచేట్టు చూడు" అని కూడా చెప్పాడు. అది నది కాదు, కాసేపు ఈదితే ఒడ్డుకు చేరుకోవడానికి. మహా సముద్రం.. ఈ ప్రమాదంలో అబ్దుల్లా తప్ప మరెవరూ బతకలేదు. "నాకిప్పుడింక ఏమీ వద్దు... నా దగ్గర ఏమీ లేదు కూడా"... తన ప్రియమైన వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వచ్చిన అబ్దుల్లా  చెబుతున్న మాటలివి. అత్యంత విలువైన కుటుంబాన్నే కోల్పోయిన తరువాత, 'నాకు మొత్తం ప్రపంచాన్ని ఇచ్చినా అక్కర్లేదు' అని విలపిస్తున్నాడు. ఇకపై స్మగ్లింగ్ పాయింట్ల వద్దకు వెళ్లి, తాను తెచ్చినట్టుగా శరణార్థులు తమ పిల్లలను పడవలు ఎక్కించవద్దని ప్రచారం చేస్తానని కుర్దీ అంటున్నాడు.