1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:17 IST)

బామ్మలకే బామ్మ : 127వ బర్త్ డే జరుపుకుందోచ్!

బామ్మలకే బామ్మ ఇంకా బతికే వుంది. మెక్సికోలోని జాపోపన్ పట్టణానికి చెందిన ‘లియాండ్రా బెకెర్రా లుంబ్రెరాస్’ అనే ఈ బామ్మ ఆదివారం 127వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంది. 1887, ఆగస్టు 31న పుట్టిన ఈమె రెండు ప్రపంచయుద్ధాలతో సహా ఎన్నో చారిత్రక ఘట్టాలను చూసింది. 
 
1910-1917 మధ్య మెక్సికన్ విప్లవంలో భర్తలతో కలిసి కదనరంగంలోకి దూకిన ‘అడెలిటాస్’ మహిళా బృందానికి స్వయంగా నాయకత్వం కూడా వహించిందట. ఐదుగురు పిల్లలు, 20 మంది మనవలు, మనవరాళ్లు ఈ అవ్వ కళ్లముందే మట్టిలో కలిసిపోయారు.
 
ఇప్పుడు 73 మంది మనవలు, మనవరాళ్లు, 55 మంది మునిమనవలు, మనవరాళ్లు ఉన్నారట. ప్రస్తుతం కొంచెం చెవుడు, కళ్లలో శుక్లాల సమస్యతో బాధపడుతున్నా ఉత్సాహంగానే ఉందట. చిన్నచిన్న పనులు కూడా సొంతంగానే చేసుకుంటోందట. 
 
ఇంతకూ ఈ అవ్వ ఆరోగ్య రహస్యం ఏంటని అడిగితే.. చాక్లెట్లు తినడం, బాగా నిద్రపోవడమేనంటున్నారు ఈమె మనవరాళ్లు. ఇప్పటికి ఉన్న రికార్డులను బట్టి చూస్తే.. మనుషుల అందరి కన్నా అత్యధిక కాలం జీవించిన మనిషి ఈమేనని కుటుంబీకులు అంటున్నారు.