సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (10:20 IST)

రష్యా సేనల తుపాకీ తూటాకు నేలకొరిగిన "మదర్ హీరోయిన్"

ఉక్రెయిన్‌ దేశాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా చేస్తున్న యుద్ధంలో అనేక మంది సామాన్య ప్రజానీకం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా రష్యా సేనల తుపాకీ గుళ్ళకు "మదర్ హీరోయిన్‌"గా గుర్తింపు పొందిన ఓల్గా సెమిడ్యానోవా ప్రాణాలు కోల్పోయారు. ఆమె వయసు 48 యేళ్లు. గత 2014 నుంచి ఆమె మిలిటరీలో సేవలు అందిస్తున్నారు. 
 
ఆమెకు ఆరుగురు సంతానం కాగా, స్థానిక అనాథ శరణాలయం నుంచి మరో ఆరుగురిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. దీంతో ఆమెకు మదర్ హీరోయిన్ అనే గౌరవ బిరుదును సొంతం చేసుకున్నారు. ఉక్రెయిన్ దేశంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు మదర్ హీరోయిన్ అనే బిరుదును ప్రదానం చేస్తారు. అలా ఓల్గా మదర్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఆమె మరణవార్త తెలుసుకున్న అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. 
 
తాజాజా డొనెట్స్క్ సమీపంలో రష్యా సేనలతో తుదివరకు పోరాడిన తర్వాత ఆమె వీరమరణం పొందారు. తమ యూనిట్‌లో సభ్యులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఆమె ఏమాత్రం ధైర్యంకోల్పోకుండా చివరి శ్వాసవరకు రష్యా సేనలతో పోరాడారు. ఆమె పొట్ట భాగంలో తుపాకీ తూటా దూసుకునిపోవడంతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.