శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (17:01 IST)

మా సహనానికి పరీక్ష వద్దు : భారత్‌కు నవాజ్ షరీఫ్ హెచ్చరిక

భారత్‌కు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గట్టిగా హెచ్చరించారు. తమ సహనానికి పరీక్ష పెట్టొద్దన్నారు. గత కొంతకాలంగా భారత్ - పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలతో పాటు పాక్ సైన్యం కూడా యధేచ్చగా కాల్పులు జరుపుతున్న విషయంతెల్సిందే. 
 
ఈ కాల్పుల విషయమై భారత్‌పైనే బురద జల్లేందుకు పాకిస్థాన్ కొత్త ఆట మొదలెట్టింది. ఇరు దేశాల సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పులకు భారత్‌దే తప్పు అనే తీరులో పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అన్నట్లు "ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్" వెల్లడించింది. 
 
ఈ కాల్పుల అంశంలో పాకిస్థాన్ ఎంతో ఓపికగా వ్యవహరిస్తుండటాన్ని అసమర్థతగా భావించవద్దని షరీఫ్ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ ఓపికను పరీక్షించొద్దని, తామేమీ చేతగాని వాళ్లం కాదని ఆయన అన్నారు. భారతదేశం ప్రవర్తిస్తున్న తీరు అంతర్జాతీయ శాంతికి భంగం కల్గించేలా ఉందని షరీఫ్ ఆరోపించారు. 
 
మరోవైపు 'ప్రపంచ స్పీకర్ల సదస్సు'లో పాకిస్థాన్‌పై భారత్ విరుచుకుపడింది. పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ ముర్తజా జావేద్ అబ్బాస్ మాట్లాడుతూ, కాశ్మీర్ ప్రజలు స్వయం నిర్ణయాధికారాన్ని వ్యక్తపరిచే సమయం ఆసన్నమైందని... అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల భారత్ తీవ్రంగా స్పందించింది. 
 
జమ్ము కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని... అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విరుచుకుపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేదికపై 2030 అభివృద్ధి లక్ష్యాల గురించి మాత్రమే మాట్లాడాలని పాకిస్థాన్‌కు సూచించారు.