మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (09:35 IST)

ఖననం చేయలేం.... శవాలను మార్చురీలోనే ఉంచండి.. చేతులెత్తేస్తున్న సిబ్బంది

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, న్యూయార్క్ నగరం ఈ వైరస్ దెబ్బకు అతలాకుతలమైపోతోంది. ఈ ప్రాంతంలో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. పైగా, మృత్యువాతపడుతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా ఉంది. గత 24 గంటల్లో అమెరికాలో మరణించిన వారి సంఖ్య ఏకంగా 1400 దాటిపోయింది. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే, అంతకంతకూ పెరుగుతున్న రోగులకు చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు.
 
ఇక న్యూయార్క్‌ నగరంలో భయానకపరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిపోగా, 3 వేల మందికిపైగా మృతి చెందారు. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో శ్మశానవాటికల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడి తట్టుకోలేక శ్మశానవాటిక నిర్వాహకులు చేతులు ఎత్తేస్తున్నారు. 
 
మృతదేహాలను కొంతకాలం పాటు ఆసుపత్రుల్లోనే ఉంచాలని మృతుల బంధువులను కోరుతున్నారు. బ్రూక్లిన్‌లోని శ్మశానవాటికలో ఒకేసారి 60 మృతదేహాలను ఖననం చేసే వీలుంది. అయితే, గురువారం ఉదయం ఒకేసారి 185 మృతదేహాలు రావడంతో ఏం చేయాలో తెలియక నిర్వాహకులు తలలుపట్టుకున్నారు. ఖననం చేసే వీలు లేకపోవడంతో మృతదేహాలపై లేపనాలు పూసి ఏసీల్లో భద్రపరిచినట్టు బ్రూక్లిన్ శ్మశానవాటిక నిర్వాహకులు తెలిపారు.