శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (11:21 IST)

అత్యవసర ల్యాండింగ్‌తోనే అల్జీరియా ప్రమాదం: ముక్కలు ముక్కలై!

అల్జీరియా విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ప్రమాదం బారినపడిన అల్జీరియా విమానం పైన దర్యాప్తు చేపట్టిన అధికారులు తెలిపారు. ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో రెండు రోజుల క్రితం జరిగిన అల్జీరియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు... విమానం చాలా బలంగా నేలను ఢీకొట్టడంతోపాటు గాలిలోకి ఎగిరిపడి ఉంటుందని భావిస్తున్నారు.
 
అందుకే ముక్కలుముక్కలై అర కిలోమీటరు పరిధిలో శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మృత్యువాతపడ్డారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక కుటుంబంలోని 10 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. కాలిపోయి, ఛిద్రమైన మృతుల అవయవాలు మాత్రమే లభ్యంకావడంతో మృతదేహాలను గుర్తించడం కుదరడం లేదంటున్నారు. ప్రతికూల వాతావరణం వల్లే పైలట్ విమానాన్ని దారి మళ్లించి ఉండవచ్చునని చెబుతున్నారు. 
 
విమానం అంత బలంగా నేలను ఎందుకు ఢీకొట్టిందో తేలాల్సి ఉందంటున్నారు. విమాన శకలాల నుంచి రెండో బ్లాక్‌బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో బర్కినా ఫాసో, లెబనాన్, అల్జీరియా, స్పెయిన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందినవారు ఉన్నారు.