నేపాల్‌లో భారీ వర్షాలు.. 102కి చేరిన మృతుల సంఖ్య.. 64 మంది గల్లంతు
నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 102కు చేరుకుందని అధికారులు తెలిపారు. శుక్రవారం నుండి తూర్పు, మధ్య నేపాల్‌లోని పెద్ద ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
సాయుధ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 64 మంది గల్లంతయ్యారు. 45మంది గాయపడ్డారు. ఖాట్మండు వ్యాలీలో అత్యధికంగా 48 మంది మరణించారు.
కనీసం 195 ఇళ్లు, ఎనిమిది వంతెనలు దెబ్బతిన్నాయి. భద్రతా సిబ్బంది దాదాపు 3,100 మందిని రక్షించారు. ఖాట్మండు లోయలో 40-45 ఏళ్లలో ఇంత విధ్వంసకర వరదలు ఎన్నడూ చూడలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మృతుల సంఖ్య 102కు చేరుకుందని సాయుధ పోలీసు దళం ఒక ప్రకటనలో తెలిపింది.