గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (16:10 IST)

మరో యుద్ధాన్ని భరించలేం... భారత్‌తో శాంతి కావాలి: పాకిస్థాన్

india - pakistan
భారత్‌తో మరో యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఆ దేశంతో శాశ్వత శాంతిని కోరుకుంటున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని షెబాజ్ షరీఫ్ అన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ బృందంతో జరిగిన ఇష్టాగోష్టి సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, కాశ్మీరీల అభిమతానికి అనుగుణంగా జమ్మూకాశ్మీర్ సమస్యను పరిష్కరించుకున్నపుడే దక్షిణాసియాలో సుస్థిర శాంతి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
"భారత్‌తో శాశ్వత శాంతిని కోరుకుంటున్నాం. అది కూడా చర్చల ద్వారానే. యుద్ధం ఇరు పక్షాలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. పైగా, మేం మరో యుద్ధాన్ని భరించలేం. అందుకే పొరుగుదేశమైన భారత్‌తో శాశ్వత శాంతిని కోరుకుంటున్నట్టు షెబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, తమ దేశం దురాక్రమణ దేశంకాదన్నారు. అయితే, తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు, ఇతర సైనిక సంపత్తి అనేది విపత్కర పరిస్థితుల్లో తమ దేశాన్ని రక్షించుకునేందుకు మాత్రమేనని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అన్ని రంగాల్లో ప్రతి దేశం దూసుకుపోతుందన్నారు. ఇలాంటి సమయంలో ఇండోపాక్ దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థికం, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు వంటి అంశాలపై పోటీతత్వం పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.